రావూ... గోపాలరావూ...

రావూ... గోపాలరావూ...

రావు గోపాలరావు - ఈ పేరు వింటే చాలు అనుకోకుండానే "అల్లో అల్లో..." అనాలనిపిస్తుంది. కూసింత కళాపోషణ ఉన్నవారందరికీ రావు గోపాలరావు అభినయమంటే తరగని అభిమానం. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నది ఆయన ఫిలాసపీ. తెరమీదే కాదు నిజజీవితంలోనూ ఆయన బాణీ అదే. కాకపోతే, తనదైన నటనతో పలుమార్లు జనాన్ని భయపెట్టారు. కొన్నిసార్లు నవ్వించారు, మరి కొన్నిసార్లు కవ్వించారు. ఇంకొన్ని సార్లు కన్నీరూ పెట్టించారు. ఏది చేస్తేనేం? ఆయన విలనీ వికారం కలిగించదు. కామెడీ కడుపులు చెక్కలు చేస్తూనే ఉంటుంది. ఇక సెంటిమెంట్ అంటారా బాధ కలిగిస్తుంది; సేద తీరుస్తుంది. 

మళ్ళీ కానరాలేదు...
రావు గోపాలరావు కొన్నిసార్లు రంగారావును తలపిస్తారు. మరికొన్ని సార్లు నాగభూషణాన్ని గుర్తుకు తెస్తారు. కానీ, ఎవరు మరచిపోలేనట్టుగా తన బాణీని పలికిస్తారు. అదీ రావు గోపాలరావు ప్రతిభ. ఆయన లేని లోటు తెలుగు చిత్రపరిశ్రమకు తీరనిలోటు అని బాధపడేవారు ఈ నాటికీ ఎందరో ఉన్నారు. కాలం కొత్తనీటికి తావిస్తూ పోతుందని అంటారు. ఎంత పాతనీరు పోయినా, ఇంకా గోపాలరావు నటన నిత్యనూతనంగానే నిలచింది.  ఇంతవరకూ రావు గోపాలరావును మరిపించిన వారు కనిపించలేదు. గొపాలరావులోని ప్రతిభకు పట్టం కట్టినవారు ఎందరో! వారందరి ఊహలకు అతీతంగా తనదైన బాణీ పలికిస్తూ వారందించిన పాత్రల్లోకి ఇట్టే పరకాయ ప్రవేశం చేసేవారాయన. బాపు బాణీకి తగ్గ వాణీ పలికించే రమణ తీర్చిదిద్దిన పాత్రల్లో రావు గోపాలరావు ఇప్పటికీ సజీవంగా జనం మదిలో నిలచే ఉన్నారు. దాసరి రూపకల్పనకు సరితూగగల  గోపాలరావు అభినయం  తళుకు ఎన్నటికీ మసకబారదు. రాఘవేంద్రుని లీలలో రావు గోపాలరావు నటనాకేళి ఆగక సాగిన సందర్భాలను గుర్తు చేసుకున్న ప్రతీసారి పరమానందమే!  ఇక జంధ్యాల మాటలతూటాలకు, భాషాపరోటాలకు తగిన న్యాయం చేసిన తీరును ఎవరు మాత్రం మరచిపోగలరు.  ఒకరని కాదు, ఎందరో దర్శకులు, రచయితలు గోపాలరావుకు తగ్గ పాత్రల రూపకల్పనకు పరిశ్రమించారు. ఆయన మాత్రం సునాయాసంగా వాటిలో ప్రవేశించేసి, ప్రేక్షకలోకాన్ని పరవశింప చేశారు. 

రాజకీయ కళ!
అభిమానం, ఆత్మీయత అంతా ఒక బూటకం అంటారు కానీ, రావు గోపాలరావుకు మాత్రం అభిమానం, ఆత్మీయత అన్నవే ప్రాణం. అన్న యన్టీఆర్ తనను చిత్రసీమలో ఆదరించిన తీరును మరచిపోలేదు. సినిమా రంగంలో గోపాలరావు అత్యున్నత స్థాయిలో రాణిస్తున్న రోజుల్లోనే రామారావు రాజకీయప్రవేశం చేశారు. ఆ సమయంలో ఆ రామునికి తగ్గ హనుమంతుని నేనేనని చాటుకున్నారు గోపాలరావు. ఎందరో సన్నిహితులు వద్దన్నారు. భవిష్యత్ చూసుకోమన్నారు. అయినా గోపాలరావు అన్నపై అభిమానంతో తెలుగుదేశం ఆవిర్భవించిన నాటి నుంచీ అందులోనే ఉన్నారు. ఆరంభంలోనే ప్రచారం చేశారు. అన్న విజయంలో తనది ఉడతాభక్తి అనీ చాటుకున్నారు. అన్న తారకరాముడు సైతం తమ్ముడు తనపై చూపిన అభిమానాన్ని మరువలేదు. ఓ కళాకారునిగా చట్టసభల్లో తెలుగువాణి వినిపించాలని రావు గోపాలరావును పెద్దల సభలో ప్రవేశ పెట్టారు. రాజ్యసభలోనూ రావు గోపాలరావు తనదైన రీతిలో రాణించారు. నటనలో అనితరసాధ్యమైన  బాణీ పలికించిన రావు గోపాలరావు తనయుడు రావు రమేశ్ ఈ తరం ప్రేక్షకులను అలరిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు. రావు గోపాలరావు లాంటి అభినయమూర్తి మళ్ళీ మనకు కానరారు. ఆయన వారసునిలోనే ఆయనను చూసుకోవలసిన సమయమిది.