నేడు జయలలిత వర్థంతి..

నేడు జయలలిత వర్థంతి..

తెలుగుతెరపై అందాలతారగా వెలిగి, తమిళనాట తలైవిగానూ జేజేలు అందుకున్నారు జయలలిత... డిసెంబర్ 5న జయలలిత వర్ధంతి... ఈ సందర్భంగా తెలుగునాట జయలలిత ఎగరేసిన జయకేతనాన్ని గుర్తు చేసుకుందాం... 

తెలుగు చిత్రసీమలో జయలలిత అడుగు పెట్టడంతోనే అదరహో అనిపించింది. అప్పటి దాకా తెలుగు సినిమా 'ఏ' సర్టిఫికెట్ ను చూసి ఉండలేదు. జయలలిత తొలి తెలుగు చిత్రం 'మనుషులు - మమతలు'తోనే తొలి ఏ సర్టిఫికెట్ మూవీని చూసింది తెలుగు సినిమా. అందాల ఆరబోతకు సై అంటూనే అభినయప్రాధాన్యమున్న చిత్రాలలో మురిపించారు జయలలిత. తొలి సినిమాతోనే తనదైన బాణీ పలికించిన జయలలిత, ఆ సినిమాతో ఆట్టే ఆశించిన విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. అయినా, రసపిపాసుల హృదయాల్లో గిలిగింతలు పెట్టింది.

తెలుగు సినిమారంగంలో మహానటుడు యన్టీఆర్ తో కలసి జయలలిత విజయయాత్ర చేసింది. వారిద్దరూ నటించిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. నటరత్న సరసన జానపద, పౌరాణిక, సాంఘికాల్లో నటించి పలు విజయాలను సొంతం చేసుకున్నారామె. 

తెలుగు చిత్రసీమలో ఏయన్నార్ సినిమాతో అడుగు పెట్టిన జయలలిత, ఆయన సరసన నాయికగా నటించిన 'నాయకుడు - వినాయకుడు'తోనే ముగింపు కూడా పలకడం విశేషం. ఇక యన్టీఆర్ హిట్ పెయిర్ గా పేరొందిన జయలలిత నిజజీవితంలో అందాల నటుడు శోభన్ బాబుతో సాన్నిహిత్యంగా ఉన్నారు. వారిద్దరి ప్రేమాయణం గురించి ఈ నాటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. అయితే శోభన్ తో జయలలిత నటించిన ఏకైక చిత్రం 'డాక్టర్ బాబు'. ఆ సినిమా మంచి విజయం సాధించింది. తెలుగునాట అందాలతారగా జైత్రయాత్ర చేసిన జయలలిత, ఎమ్జీఆర్ ప్రోత్సాహంతో తమిళనాట రాజకీయాల్లో ప్రవేశించారు. ఎమ్జీఆర్ అనంతరం అన్నాడిఎమ్.కే. పార్టీని విజయతీరాలకు చేర్చిన ఘనత జయలలిత సొంతం. ప్రస్తుతం తమిళనాట అధికారంలో ఉన్నది కూడా జయలలిత అనుయాయులే. ఏది ఏమైనా తెలుగువారి మదిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు జయలలిత.