భారీ నష్టాల నుంచి భారీ లాభాల్లోకి... నిఫ్టి

భారీ నష్టాల నుంచి భారీ లాభాల్లోకి... నిఫ్టి

స్థిరంగా ప్రారంభమైన మార్కెట్‌ ఒకదశలో 90 పాయింట్ల వరకు క్షీణించింది. మిడ్ సెషన్‌ తరవాత ఊపందుకున్న నిఫ్టి 78 పాయింట్ల లాభంతో 11000పైన ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 299 లాభంతో 36,526 వద్ద, నిఫ్టి 11,008 వద్ద ముగిశాయి. రూపాయి భారీగా క్షీణించినా స్టాక్‌ మార్కెట్‌ రాణించడం విశేషం. రియాల్టి సూచీ తప్ప అన్ని రంగాల సూచీలు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. ఒకదశలో ఒకటిన్నర శాతం క్షీణించిన పీఎస్‌యూ బ్యాంక్‌ నిఫ్టి క్లోజింగ్‌కల్లా 3.63 శాతం లాభంతో ముగిసింది. అలాగే ఐటీ కూడా రెండున్నర శాతంపైన లాభపడింది. నిఫ్టి ప్రధాన షేర్లలో ఎస్‌ బ్యాంక్‌ షేర్‌ రికార్డు స్థాయిలో 8.8 శాతం లాభపడింది. హిందాల్కో ఆరు శాతం, ఇండియా బుల్స్‌ హౌసింగ్ ఫైనాన్స్‌ 4 శాతం చొప్పున లాభపడగా, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ షేర్లు మూడు శాతంపైగా లాభంతో క్లోజయ్యాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో భారతీ ఎయిర్‌టెల్‌ 4 శాతం క్షీణించగా, హెచ్‌పీసీఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ 3 శాతంపైగా క్షీణించాయి. అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 2.9 శాతం, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 2 శాతం తగ్గాయి. ఇతర షేర్లలో బంధన్‌ బ్యాంక్‌ షేర్‌ 20 శాతం నష్టంతో క్లోజైంది. అలాగే దీవాన్‌ హౌసింగ్‌ కూడా 17 శాతం లాభపడింది. వాట్సప్‌ మెసేజ్‌ కారణంగా భారీగా నష్టపోయిన ఇన్ఫీబీమ్‌ షేర్‌ ఇవాళ 12.6 శాతం పెరగడం విశేషం.