సుధీర్ బాబు ఆ సాహసం వర్కౌట్ అవుతుందా..?

సుధీర్ బాబు ఆ సాహసం వర్కౌట్ అవుతుందా..?

బాలీవుడ్ లో మొదలైన బయోపిక్ సినిమాల హడావుడి ఇప్పుడు టాలీవుడ్ లోను కనిపిస్తున్నది.  మహానటి సినిమా టాలీవుడ్ లో విజయం సాధించడంతో.. అదే తరహాలో అనేక సినిమాలు తెరకెక్కుతున్నాయి.  కొన్ని రిలీజ్ కు సిద్ధం అవుతుండగా కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి.  స్పోర్ట్స్ స్టార్స్ కు క్రేజ్ ఉండటంతో.. ఆయా రంగాల్లో విజయాలు సాధించిన వ్యక్తుల జీవిత కథల ఆధారంగా సినిమాలను తెరకెక్కించేందుకు సిద్ధం అవుతున్నారు.  

ఇప్పుడు ఇదే కోవలో మరో సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు సుధీర్ బాబు, ప్రవీణ్ సత్తారు.  పుల్లెల గోపీచంద్ జీవిత చరిత్ర ఆధారంగా వీరు సినిమా చేయబోతున్నారు.  గోపీచంద్ సాధించిన విజయాలు, ఆయన జీవితంలో ఎదురైన సంఘటనల ఆధారంగా సినిమా తెరకెక్కుతుందట.  సుదీర్ బాబు దీనికోసం ప్రత్యేకంగా బాడ్మింటన్ శిక్షణ కూడా తీసుకున్నాడు.  ఇంతవరకు బాగానే ఉన్నది.  ఇక్కడ ఓ విషయమే అంతుపట్టడం లేదు.  పుల్లెల గోపీచంద్ బయోపిక్ ను రెండు భాగాలుగా తెరకెక్కించాలని చూస్తున్నారు.

ఎన్టీఆర్ బయోపిక్ మాదిరి ఈ సినిమాను అలాగే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.  ఎన్టీఆర్ కు ఉన్న ఇమేజ్ వేరు.  పైగా ఆ సినిమాలో బాలకృష్ణ వంటి మాస్ ఇమేజ్ ఉన్న నటుడు నటిస్తున్నాడు.  రెండు భాగాలు ఆ సినిమాకు వర్కౌట్ అవుతుంది.  ప్రముఖ క్రికెట్ స్టార్స్ జీవిత చరిత్రల ఆధారంగా వచ్చిన సచిన్, ధోని సినిమాలే ఒక్కో భాగంతో ముగించారు.  మనదేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ బ్యాడ్మింటన్ కు లేదు.  మరి అలాంటప్పుడు రెండు భాగాలుగా తెరకెక్కితే వర్కౌట్ అవుతుందా.