రాళ్లపల్లి కన్నుమూత

రాళ్లపల్లి కన్నుమూత

తెలుగు సినిమా రంగం మరో అరుదైన నటుడిని కోల్పోయింది. ప్రముఖ రంగస్థల, సినిమా నటుడు..రాళ్ళపల్లిగా ప్రసిద్ధి చెందిన రాళ్ళపల్లి నరసింహారావు అనారోగ్యంతో కన్ను మూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. నటనను వృత్తిగా, ప్రవృత్తిగా కాకుండా నటనే ప్రాణంగా ప్రేమించిన అరుదైన నటుడు రాళ్లపల్లి. చిన్నతనం నుంచే నాటకాలు వేసిన రాళ్లపల్లి సుమారు 8 వేలకు పైగా నాటకాల్లో నటించారు. వీటిలో చాలా వరకు తనే స్వయంగా రాసి దర్శకత్వం వహించినవే. తనికెళ్ల భరణి వంటి రచయితలకు రాళ్లపల్లి మార్గదర్శకులుగా నిలిచారు. మూడు దశాబ్దాల సినీ జీవితంలో రాళ్లపల్లి దాదాపు ఆరొందలకు పైగా చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు. ఎలాంటి పాత్రనైనా అత్యంత సహజంగా, అవలీలగా పోషించడం రాళ్లపల్లికే సొంతం. తన సీనియర్లు, పరిశ్రమలో ఉన్న లబ్ధప్రతిష్టులైన నటులను అనుకరించకుండా తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు. 

రాళ్లపల్లి తూర్పు గోదావరి జిల్లా రాచపల్లిలో అక్టోబర్ 10, 1945లో జన్మించారు. ఆయనకు కన్యాశుల్కం నాటకం ఎంతో పేరు తెచ్చింది. విద్యార్థిగా ఉన్న రోజుల్లో కళాశాల పోటీల కోసం మారని సంసారం అనే నాటిక రాసి నటించారు. రెండింటికి ప్రముఖ నటి భానుమతిగారి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. నాటకాల్లో నటిస్తూనే 1973లో 'స్త్రీ' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. జాతీయస్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైన ఊరుమ్మడి బతుకులు చిత్రంతో నంది అవార్డుతో పాటు మంచి బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత చిల్లర దేవుళ్లు, చలిచీమలు సినిమాలతో వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేకుండా పోయింది. ఆయన జంధ్యాల, వంశీ చిత్రాల్లో తప్పనిసరిగా ఉండేవారు.