మోడీకి టాలీవుడ్ డైరెక్టర్ పూరి బహిరంగ లేఖ.. ముందు దాని సంగతి చూడండి..!

మోడీకి టాలీవుడ్ డైరెక్టర్ పూరి బహిరంగ లేఖ.. ముందు దాని సంగతి చూడండి..!

పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ.. ఇప్పుడు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలనే నిర్ణయానికి వచ్చారు.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం విధించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక, తాజాగా, తమిళనాడు పర్యటనలో ఉన్న సందర్భంగా బీచ్‌లో ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరి ప్రజల్లో చైతన్యం తేవడానికి పూనుకున్నారు. అయితే. ప్రధాని నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశారు టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. ప్లాస్టిక్ నిషేధం ఆలోచనలో ఉన్న మోడీకి నేరుగా కొన్ని సూచనలు చేశారు. ప్రధాని బహిరంగలేఖ రాసిన డాషింగ్ డైరెక్టర్.. ఆ లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశారు.. మిగతా సమస్యలతో పోల్చుకుంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంత పెద్ద సమస్య కాదన్న తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. 

ఇప్పుడున్న ప్లాస్టిక్‌ని సరిగా వినియోగించుకుంటే సరిపోతుందని లేఖలో పేర్కొన్నాడు పూరి.. ఉన్నట్టుండి ప్లాస్టిక్‌ని నిషేధిస్తే ఎకో ఫ్రెండ్లీ బ్యాగులు ఉపయోగించాలి. వాటిని ఉత్పత్తి చేయాలంటే ఎన్నో చెట్లు నాశనం అవుతాయని మోడీకి దృష్టికి తీసుకొచ్చారు. ప్లాస్టిక్ వాడకం కన్నా.. వాహనాల నుంచి వచ్చే కాలుష్యమే అత్యంత ప్రమాదకరమన్న పూరి.. ముందు దీనిని నివారించే చర్యలు చేపట్టాలని సూచించారు. ప్లాస్టిక్ వాడకంపై కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని లేఖలో పేర్కొన్న పూరి.. ఇప్పుడున్న ప్లాస్టిక్‌నే పునరుత్పత్తి చేయాలి.. అదేవిధంగా ప్లాస్టిక్ కవర్లు కోసం ప్రజలకు ప్రభుత్వం కొంత డబ్బు చెల్లించాలని తెలిపారు. దీంతో ప్లాస్టిక్ కవర్లని ప్రజలు జాగ్రత్తగా వినియోగించుకుంటారని అభిప్రాయపడ్డారు. అది కూడా డబ్బే అని ఫీల్ వాళ్లలో వస్తుందని.. ఎక్కడపడితే అక్కడ వాటిని పడేయడానికి సిద్ధపడరని.. అదే విధంగా ప్లాస్టిక్‌ని క్లీన్ చేసే యూనిట్స్‌ని ప్రభుత్వం ప్రారంభించాలని తన లేఖలో ప్రధాని మోడీకి కీలక సూచనలు చేశారు పూరి జగన్నాథ్.