ప్రముఖ బిస్కెట్ సంస్థ నుంచి 10 వేల ఉద్యోగులు ఇంటికే..!

ప్రముఖ బిస్కెట్ సంస్థ నుంచి 10 వేల ఉద్యోగులు ఇంటికే..!

ఆర్థిక వ్యవస్థ మందగమనంతో ప్రముఖ కంపెనీలు సైతం తమ ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడిపోతున్నాయి. ఈ జాబితాలో తాజాగా ప్రముఖ బిస్కెట్ తయారీ సంస్థ కూడా చేరిపోయింది. ప్రముఖ భారతీయ బిస్కెట్ తయారీ సంస్థ పార్లే ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్... 10,000 మంది కార్మికులను తొలగించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆర్థిక వృద్ధి మందగించడం, గ్రామీణ ప్రాంతాల్లో తమ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గడంతో ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. 

ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉందంటున్నారు. కార్ల నుండి దుస్తుల వరకు ప్రతిదీ అమ్మకం కష్టం మారిందని.. దీంతో ఉత్పత్తిని తగ్గించేపనిలో పడిపోయాయి ఆయా కంపెనీలు. ఇక, పార్లే బిస్కెట్ అమ్మకాలలో గణనీయమైన తగ్గుదల ఉండడంతో.. కంపెనీ ఉత్పత్తిని తగ్గించాల్సి ఉంటుంది, దీంతో 8,000-10,000 మంది ఉద్యోగుల తొలగింపుకు కారణం కావచ్చు అని ఓ జాతీయ మీడియా సంస్థతో టెలిఫోన్ ఇంటర్వ్యూలో వెల్లడించారు పార్లే హెడ్ మయాంక్ షా. "పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోకపోతే.. ప్రస్తుత స్థానం నుంచి మేం బలవంతంగా తప్పుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. కాగా, 1929లో స్థాపించబడిన పార్లేలో ప్రత్యక్ష, కాంట్రాక్ట్ కార్మికులు సహా సుమారు లక్ష మంది ఉద్యోగులు ఉన్నారు. 10 కంపెనీలు, 125 కాంట్రాక్ట్ తయారీ కంపెనీలను నడుపుతోంది. 2017లో భారతదేశం దేశవ్యాప్త వస్తువుల మరియు సేవల పన్ను (జీఎస్‌టీ)ని ప్రవేశపెట్టినప్పటి నుండి పార్లే-జి వంటి ప్రసిద్ధ పార్లే బిస్కెట్ బ్రాండ్‌లకు డిమాండ్ మరింత దిగజారినట్టు లెక్కలు చెబుతున్నాయి.