సుప్రీంకోర్టుకు నలుగురు కొత్త జడ్జిలు

సుప్రీంకోర్టుకు నలుగురు కొత్త జడ్జిలు

త్వరలోనే సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నలుగురు కొత్త జడ్జిలు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీంతో ఐదేళ్లలో మొదటిసారిగా దేశ అత్యున్నత న్యాయస్థానంలో పూర్తిగా 31 జడ్జిలు ఉండనున్నారు. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ ఏ ఎస్ బొపన్న, జస్టిస్ భూషణ్ రాంకృష్ణ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులుగా పదోన్నతి పొందనున్నారు. ఝార్ఖండ్ హైకోర్ట్ కి చెందిన జస్టిస్ అనిరుద్ధ బోస్, గౌహతి హైకోర్ట్ కి చెందిన జస్టిస్ ఏఎస్ బొపన్నలపై కేంద్రం అభ్యంతరాలను తోసిపుచ్చుతూ సుప్రీంకోర్ట్ కొలీజియమ్ నిర్ణయం తీసుకొంది. కొలీజియం సిఫార్సు చేసిన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ ఏఎస్ బొపన్నలకు తగిన సీనియారిటీ లేదంటూ ఈ నెల మొదట్లో వారి పేర్లను కేంద్ర ప్రభుత్వం తిప్పి పంపింది. 

ఏడు దశల్లో జరిగిన జాతీయ ఎన్నికల ప్రారంభంలో ఏప్రిల్ 12న కొలీజియం తన సిఫార్సులను కేంద్రానికి పంపింది. గత ఏడాది జస్టిస్ కెఎం జోసెఫ్ ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి ఇచ్చేందుకు నిరాకరించి కేంద్ర ప్రభుత్వం న్యాయవ్యవస్థను ఢీ కొట్టింది. కానీ కొలీజియం మరోసారి తన ఎంపికను మార్చుకొనేందుకు నిరాకరించడంతో కేంద్రం దిగిరాక తప్పలేదు. గత ఏడాది ఆగస్ట్ లో జస్టిస్ జోసెఫ్ ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్ట్ అత్యున్నత జడ్జిలు సంతకం చేసిన తీర్మానం ప్రకారంప్రతిభ, సీనియారిటీ, హైకోర్టుల్లో వారి ప్రాతినిధ్యం అనుసరించి కొలీజియం  జస్టిస్ బోస్, జస్టిస్ బొపన్నలకు పదోన్నతి కల్పించాలని నిర్ణయించింది.

చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం బాంబే హైకోర్ట్ జడ్జి జస్టిస్ బీ ఆర్ గవాయ్, హిమాచల్ ప్రదేశ్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ లకు సర్వోన్నత న్యాయస్థానానికి జడ్జిలుగా నియమించాలని సిఫార్సు చేసింది. 2025లో చీఫ్ జస్టిస్ గా పదోన్నతి పొందనున్న జస్టిస్ గవాయ్ జస్టిస్ కెజి బాలకృష్ణన్ తర్వాత సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ గా నియమితులైన రెండో దళితుడు కానున్నారు.