సాధ్వీ ప్రజ్ఞా కేన్సర్ నివారణోపాయాలను ఖండిస్తున్న డాక్టర్లు

సాధ్వీ ప్రజ్ఞా కేన్సర్ నివారణోపాయాలను ఖండిస్తున్న డాక్టర్లు

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ కేన్సర్ చికిత్సపై రోగులను తప్పుదోవ పట్టిస్తున్నారని టాటా మెమోరియల్ డైరెక్టర్ రాజేంద్ర బద్వే, ఆయన బృందం మండిపడ్డారు. 2010లో సాధ్వీని పరీక్షించిన జెజె ఆస్పత్రి మాజీ డీన్ టీపీ లహానే ఆమెకు అసలు ఏ జబ్బూ లేదని తేల్చి చెప్పారు. గోమూత్రం, ఇతర గో ఉత్పత్తుల మిశ్రమంతో తాను కేన్సర్ ని జయించినట్టు చెబుతున్న బీజేపీ భోపాల్ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ప్రకటనలను ముంబైకి చెందిన కేన్సర్ చికిత్స నిపుణులు తీవ్రంగా ఖండిస్తున్నారు. కేన్సర్ చికిత్సలో గోమూత్రం, ఇతర ఉత్పత్తులు ప్రయోజనకరమని అణుమాత్రమైనా రుజువులు లేవని టాటా మెమోరియల్ సెంటర్ డైరెక్టర్, దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన రొమ్ము కేన్సర్ సర్జన్ కూడా అయిన డాక్టర్ రాజేంద్ర బద్వే అన్నారు. రేడియోథెరపీ, కెమోథెరపీ, ఇప్పుడు ఇమ్యూనోథెరపీ మాత్రమే రొమ్ము కేన్సర్ కు శాస్త్రీయ చికిత్సలుగా ప్రపంచవ్యాప్తంగా అంగీకరించబడ్డాయని చెప్పారు.

2008లో జరిగిన మాలేగావ్ పేలుళ్ల కేసులో తాను మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ కస్టడీలో ఉండగా 2010లో తనకు కేన్సర్ ఉన్నట్టు తెలిసిందని సాధ్వీ ప్రజ్ఞా చెప్పారు. అప్పుడు ఆమెకు జేజే హాస్పిటల్ లో పలు పరీక్షలు నిర్వహించారు. అయితే అసలు పరీక్షలు జరిపేందుకు తనను తాకడంపై కూడా ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారని ఆనాడు పరీక్షలు నిర్వహించిన జేజే ఆస్పత్రి డాక్టర్లు గుర్తు చేసుకున్నారు. అప్పుడు ఆ ఆస్పత్రి డీన్ గా ఉన్న డాక్టర్ టీపీ లహానే ప్రజ్ఞకు ఎలాంటి పెద్ద జబ్బు చేయలేదని స్పష్టం చేశారు. 'కేన్సర్ నిర్ధారణకు జరిపే సీఏ 125 బ్రెస్ మార్కర్ పరీక్షలో నెగెటివ్ వచ్చింది. ఆమె ఎంఆర్ఐ స్కాన్ రిపోర్ట్ అంతా మామూలుగానే ఉంది. అలాగే ఈసీజీ రిపోర్ట్ కూడా' అని ఆయన తెలిపారు. 

సోమవారం తన నామినేషన్ పత్రాలు వేసే ముందు సాధ్వీ తను కేన్సర్ రోగినని చెప్పారు. తాను ఆయుర్వేద మూలికల మిశ్రమాన్ని గో మూత్రం, పంచగవ్యాలతో కలిపి సేవించి నయం చేసుకున్నానని అన్నారు. 

ఇలాంటి ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తాయని బద్వే, ఆయన బృందం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రకటనలు జబ్బు బాగా ముదిరిన తర్వాత ఆస్పత్రులకు వచ్చే కేన్సర్ రోగులను తప్పుదారి పట్టిస్తాయని సీనియర్ తల, మెడ ఆంకాలజీ సర్జన్, టాటా మెమోరియల్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ అయిన డాక్టర్ పంకజ్ చతుర్వేది అన్నారు. రొమ్ము కేన్సర్, రక్త కేన్సర్ లను శాస్త్రీయంగా రుజువైన చికిత్సలతో నయం చేయవచ్చని సెంటర్ అకడమిక్స్ డైరెక్టర్, రొమ్ము, పిల్లల కేన్సర్ పై పలు పరిశోధన పత్రాలు ప్రచురించిన డాక్టర్ శ్రీపాద్ బనవలి అంటున్నారు. గో మూత్రం రొమ్ము కేన్సర్ నయం చేస్తుందని అనేవారు ఏదైనా అధ్యయనం ద్వారా దానిని రుజువు చేయగలరా? అని ఆయన ప్రశ్నించారు.

ఠాకూర్ వంటి వారు చెప్పే మాటలకు ప్రాముఖ్యత ఇవ్వరాదని ప్రిన్స్ అలీ ఖాన్ అండ్ బ్రీచ్ క్యాండీ హాస్పిటల్స్ లో ప్రధాన సర్జికల్ ఆంకాలజిస్ట్ అయిన డాక్టర్ సుల్తాన్ ప్రధాన్ చెప్పారు. మొదట ఇలాంటి నమ్మలేని చికిత్సలు చేయించుకొని చివరికి నయం కాక బాగా ఆలస్యంగా హాస్పిటల్ కి వచ్చేవాళ్లెందరినో రోజూ చూస్తుంటామని ఆయన తెలిపారు.