ఆ విషయాన్ని ఫలితాలే రుజువుచేశాయి

ఆ విషయాన్ని ఫలితాలే రుజువుచేశాయి

కాంగ్రెస్‌ పునాదులపై తక్కువ అంచనా వేశారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అన్నారు. నల్లగొండ ఎంపీగా విజయం సాధించిన అనంతరం హైదరాబాద్ లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో తమ పార్టీ బలంగా ఉందని, లోక్‌సభ ఎన్నికల్లో ఆరు సీట్లు గెలవాల్సి ఉన్నప్పటికీ మూడింట్లో మాత్రమే విజయం సాధించామని చెప్పారు.  లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్‌ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపిందని చెప్పారు. తనకు ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తానని స్పష్టం చేశారు. పీసీసీ మార్పుపై ఎప్పటివరకు ఎలాంటి చర్చా జరగలేదన్నారు. కాంగ్రెస్‌ నుంచి ఎవరు వెళ్లినా నష్టంలేదని లోక్‌సభ ఫలితాలు స్పష్టం చేశాయని చెప్పారు. 

'తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీయే టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెసే. ఆ పార్టీని ఎప్పటికైనా గద్దె దించేది తామే. బీజేపీకి ఆ స్థాయి లేకపోయినప్పటికీ అదృష్టం కొద్దీ నాలుగు స్థానాల్లో గెలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో 100స్థానాల్లో బీజేపీకి డిపాజిట్‌ కూడా దక్కలేదు. ఈ అంశమే స్థానికంగా బీజేపీకి ఉన్న బలమేంటో తెలియజేస్తోంది. రాజకీయాల్లో అహంకారం పనికిరాదు. నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే హవా. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జడ్పీ ఛైర్మన్లు కూడా కాంగ్రెస్‌వే. రాష్ట్రంలో టీఆర్ఎస్ ఒకప్పటిలా లేదు. ఇప్పుడు పరిస్థితి మారింది' అని ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.