ముదిరిన వాణిజ్య యుద్ధం: అమెరికాపై చైనా సుంకాలు

ముదిరిన వాణిజ్య యుద్ధం: అమెరికాపై చైనా సుంకాలు

అగ్రరాజ్యం అమెరికా, ఆసియా దిగ్గజం చైనాల వాణిజ్య యుద్ధం తారస్థాయికి చేరింది. ఇందులో భాగంగా జూన్ 1 నుంచి 60 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా వస్తువులపై కొత్త సుంకాలు విధించనున్నట్టు చైనా ప్రకటించింది. 200 బిలియన్ డాలర్ల విలువైన చైనా దిగుమతులపై అమెరికా రెండింతల కంటే ఎక్కువ సుంకాలు విధించిన మూడు రోజులకే బీజింగ్ ఈ విధంగా ప్రతీకారం తీర్చుకొంది. అంతే కాకుండా అమెరికా వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లు నిలిపేసే ఆలోచనలో కూడా చైనా ఉన్నట్టు తెలిసింది. అదే జరిగితే అమెరికా రైతులకు పెద్ద దెబ్బ తగలనుంది. ఆపైన కొత్త బోయింగ్ విమానాల ఆర్డర్లను తగ్గించడం లేదా రద్దు చేసుకోవాలని చైనా భావిస్తోంది.

దీనికి ముందు చైనా దిగుమతులపై అమెరికా వినియోగదారులు ఎక్కువ సుంకాలు చెల్లించాల్సి వస్తుందన్న వాదననను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొట్టి పారేశారు. అలా చేయవద్దని చైనాకు హెచ్చరిక జారీ చేశారు. కానీ తన ప్రయోజనాలకు నష్టం కలిగించే చేదు మాత్రలను మౌనంగా మింగబోనని స్పష్టం చేస్తూ చైనా అమెరికాకు ధీటుగా జవాబు ఇచ్చింది. చైనా నిర్ణయం వార్త రావడానికి ముందు ట్వీట్ చేస్తూ ట్రంప్ 'చైనా ఎదురు తిరగరాదు-లేకపోతే పరిస్థితి మరింత క్షీణిస్తుందని' ట్వీట్ చేశారు. 'ఇన్నేళ్లుగా అమెరికా పరిస్థితిని చైనా తనకు అనుకూలంగా వాడుకుందని' ట్రంప్ పేర్కొన్నారు.

అమెరికా వినియోగదారులు ఇతర దేశాలకు చెందిన అవే ఉత్పత్తులను కొనుగోలు చేసి సుంకాలు తప్పించుకోవచ్చని ట్రంప్ సూచించారు. 'సుంకాలు చెల్లించాల్సిన చాలా కంపెనీలు చైనాను వీడి వియత్నాం, ఇతర ఆసియా దేశాలకు వెళ్లిపోతాయి. అందుకే చైనా ఇలాంటి ఒప్పందం చేసుకోవాలనుకుంటోందని' తెలిపారు. 

చైనా ప్రకటన రాగానే వాల్ స్ట్రీట్ లో ప్రీ మార్కెట్ ట్రేడింగ్ లోని  స్టాకులు పతనమయ్యాయని అనలిస్టులు తెలిపారు.