అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం

అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం

అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్దం మొదలైంది. 200 బిలియన్ డాలర్ల మేరా విలువ చేసే చైనా వస్తువులపై సుంకం 25శాతం పెంచుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. అమెరికా చైనాల మధ్య గత కొన్ని నెలలుగా వాణిజ్య యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. వాణిజ్య చర్చల్లో ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. చైనా ఉత్పత్తుల మీద సుంకాలను అమెరికా పెంచినట్లయితే అవసరమైన ప్రతిచర్యలతో తిప్పికొడతామని చైనా వ్యాఖ్యానించిన అనంతరం ట్రంప్ పై వ్యాఖ్యలు చేశారు. దాదాపు 200 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తుల మీద సుంకాలను శుక్రవారం రెట్టింపుకన్నా ఎక్కువ పెంచుతామని ఆయన స్పష్టం చేశారు. అమెరికాలో ఇరుపక్షాల చర్చలు ప్రారంభం కావటానికి ముందు.. వాణిజ్యం మీద చైనాతో తాము చర్చిస్తున్న ఒప్పందాన్ని ఆ దేశ నాయకులు ఉల్లంఘించారని ట్రంప్ ఆరోపించారు.

గత 10 నెలలుగా అమెరికాలో చైనా వస్తువుల అమ్మకాలపై డ్రాగన్ కంట్రీ సుంకం కడుతూ వస్తోంది. ఇందులో 50 బిలియన్ డాలర్లు విలువ చేసే హైటెక్ వస్తువులపై 25 శాతం, 200 బిలియన్ డాలర్లు విలువ చేసే ఇతర వస్తువులపై 10శాతం సుంకం చెల్లిస్తోంది. చైనాలో అమెరికా వస్తువులపై... అమెరికాలో చైనా వస్తువులపై సుంకం విధించే క్రమంలో రెండు దేశాలు వాణిజ్య యుద్ధానికి తెరతీశాయి. అయితే ఇది తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ట్రంప్ జింగ్‌పింగ్‌లు ఒక సంధి కుదుర్చుకునేందుకు సిద్ధమయ్యారు.