ట్రాఫిక్ ఫైన్లు కట్టని కోటీశ్వరులు

ట్రాఫిక్ ఫైన్లు కట్టని కోటీశ్వరులు

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, ఆయన కుటుంబ సభ్యులు ఆఫ్టరాల్ ట్రాఫిక్ చలానా కట్టలేదంటే నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే. సల్మాన్ కుటుంబ సభ్యులతో పాటు ముంబైలో పేరు ప్రతిష్టలు గల పెద్ద కుటుంబాలు కూడా చలానాలు కట్టని జాబితాలో ఉన్నాయి. అలా ముంబై ట్రాఫిక్ పోలీస్ కు మొత్తం రూ. 119 కోట్లు ట్రాఫిక్ వయొలేషన్ ఫైన్ కింద రావాల్సి ఉంది. ముంబై ట్రాఫిక్ పోలీసులు ఈ-చలానాలు ఇంట్రడ్యూస్ చేసిన 2016 అక్టోబర్ నుంచి గత జూన్ వరకు పోలీసులు ఫైన్స్ కింద 53 లక్షల ఈ-టికెట్లు జారీ చేశారు. ఆ మొత్తం రూ. 172.44 కోట్లు అవుతుండగా.. రూ. 53.8 కోట్ల మొత్తాన్ని సెటిల్ చేశారు. ఓవర్ స్పీడింగ్, రూల్స్ కి విరుద్ధంగా జీబ్రా క్రాసింగ్, రాంగ్ పార్కింగ్ వంటి కారణాల మీద ట్రాఫిక్ పోలీసులు ఇలా ఫైన్లు వేశారు. 

ముంబైమిర్రర్ పత్రిక ఆర్టీఐ కింద చేసిన పరిశోధనలో ఈ వివరాలు వెలుగు చూశాయి. సల్మాన్ వాడిన కారు 4 సార్లు రూల్స్ అతిక్రమించినట్టు నమోదైంది. ఆ కారు ఆయన సోదరుడు అర్బాజ్ ఖాన్ పేరు మీద రిజిస్టరై ఉంది (MH 02 BY 2727). దాని మీద రూ. 4 వేల ఫైన్ పెండింగ్ లో ఉంది. అలాగే ఆదిత్య థాకరే వాడిన కారు (MH 02 CB 1234) మీద 6 సార్లు ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ పేరుతో రూ. 6 వేలు ఫైన్ వేశారు. ఓవర్ స్పీడింగ్ మీద ఒక్కసారి పట్టుబడితే రూ. ఒక వెయ్యన్నమాట. 2016 మే నుంచి 2018 వరకు ఆదిత్య థాకరే కారు ఆరుసార్లు ఓవర్ స్పీడ్ కింద బుక్కయ్యింది. తమ కుటుంబ సభ్యులకు చెంది చలానాలు బకాయి పడ్డవారిలో సల్మాన్ ఖాన్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి-సీనియర్ బీజేపీ లీడర్ దివాకర్ రావత్, ఎంఎన్ఎస్ ఫౌండర్ రాజ్ థాకరే, ఆ పార్టీ యువసేన అధ్యక్షుడు ఆదిత్య థాకరే తదితరులు ఉన్నారు. ఇక సొంత వాహనాల్లో డ్రైవ్ చేస్తూ ట్రాఫిక్ వయొలేషన్స్ కి పాల్పడ్డవారిలో కమెడియన్ కపిల్ శర్మ (MH 04 Fz 770) కూడా ఉన్నారు. ఆయన వెహికల్ మీద రూ. 2 వేల ఫైన్ పెండింగ్ లో ఉంది. 

కొందరు వీవీఐపీలు వాడే వెహికల్స్, వారి హోదాను పరిగణనలోకి తీసుకుంటే వారి మీద ఉన్న చలానాలు చాలా సిల్లీగా కనిపిస్తాయి. శివసేన నాయకుడు రాజ్ థాకరే రూ. లక్షలు వెచ్చించి స్పెషల్ రిజిస్ట్రేషన్ నెంబర్ దక్కించుకున్నారు. ఆయన వెహికల్ నెంబర్ MH 46 J 9. అయితే ఫ్యాన్సీ నెంబర్ ప్లేటు వాడినందుకు రూ. వెయ్యి జరిమానా వేశారు. మరో సందర్భంలో జీబ్రాక్రాసింగ్ వద్ద ఆపనందుకు రూ. 200 వేశారు. రవాణా మంత్రి దివాకర్ రావత్ కుమారుడు ఉమేశ్ వెహికల్ (MH 06 BE 4433) మీద ఓవర్ స్పీడింగ్ పై రూ. వెయ్యి ఫైన్ వేశారు. అయితే మంత్రి రూల్స్ కి విలువ ఇస్తారని, ఉల్లంఘనల సంగతులు ఆయనకు తెలియవని ఆయన అనుచరులు చెబుతున్నారు. బండి నడిపింది ఆయన డ్రైవర్ కదా. ఉల్లంఘించింది కూడా డ్రైవరే.. అలాంటప్పుడు మంత్రికేం సంబంధం అంటున్నారు వారు. మేయర్ మహదీశ్వర్ అసలిలాంటి విషయాలు తాను పట్టించుకోనని, అవన్నీ డ్రైవర్ పొరపాట్లని కొట్టిపారేస్తున్నారు. ఫైన్ కట్టామా లేదా అన్నది కూడా డ్రైవర్ బాధ్యతే అంటున్నారాయన. ఆయన వెహికల్ (MH 01 CT1935) మీద మూడుసార్లు ఓవర్ స్పీడింగ్ వల్ల రూ. 3 వేలు ఫైన్ నమోదైంది. అది పే చేయాల్సి ఉంది. నటుడు అర్జున్ కపూర్ (MH 02 EP 2600) వెహికల్ ఓవర్ స్పీడింగ్ కింద 3 సార్లు బుక్కయింది. దీనిపై ముంబై మిర్రర్ నుంచి అర్జున్ కపూర్ ఆఫీస్ కి కాల్ వెళ్లగానే ఫైన్ కట్టేయడం విశేషం. ఇక రామ్ కదమ్ కారు (MH 04 FA 4444) ఓ సినిమా ఫర్మ్ పేరుతో రిజిస్టరైంది. గతేడాది నుంచి ఇప్పటివరకు ఐదుసార్లు ఓవర్ స్పీడ్ లో వెళ్లినట్టు చలానాలు జారీ అయ్యాయి. అయితే ఆ వెహికల్ ని రామ్ కదమ్ చాలాకాలం క్రితం అమ్మేశారట. ముంబై మేయర్ విశ్వనాథ్ మహదీశ్వర్, ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్, రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రామ్ కదమ్ తదితరులకు చాలాసార్లు ఈ-చాలానాలు జారీ అయ్యాయి. 

అయితే చాలామంది తమ వెహికల్స్ మీద చలానాలు జారీ అయిన విషయం తెలియదని, తెలిస్తే కట్టి ఉండేవాళ్లమని చెప్పారు. అదే విషయాన్ని సల్మాన్ ఖాన్ కార్యాలయ సిబ్బంది ఇక రామ్ కదమ్  కూడా కన్ఫామ్ చేశారు. ఇలా ఫైన్లు కట్టకుండా ఉన్న సెలబ్రిటీలు ముంబైలో చాలా మందే ఉన్నారు. కొందరు వెహికల్ ఓనర్లు ఫైన్ కట్టడాన్ని ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకుంటున్నారు. అసలు ఏ వయొలేషన్స్ కు పాల్పడకుండా ఫైన్ ఎందుక్కట్టాలంటున్నారు. స్పాట్ దగ్గరే లేకుండా తమ వెహికల్ మీద ఫైన్ ఎలా రెయిజ్ అయిందంటున్నారు మరికొందరు. అమెరికాలో ఉంటున్న ఓ వ్యక్తి పేరు మీద రెయిజ్ అయిన టికెట్ ఇలాంటిదే. విచిత్రంగా ఆయన వాడిన ఆటో నిబంధనలు ఉల్లంఘించినట్టు పోలీసులు చలానా ప్రిపేర్ చేశారు.  

దీనిమీద ట్రాఫిక్ పోలీసులు ఏమంటున్నారంటే.. చాలా మంది వీవీఐపీలు తమ వెహికల్స్ ని తాజా ఫోన్ నెంబర్లు, చిరునామాలతో అప్ డేట్ చేసుకోవడం లేదని, చలానాలు ఈ-పద్ధతిలో కట్టే వెసులుబాటు ఉన్నా కట్టడం లేదని అంటున్నారు. వారు దీన్ని తేలిగ్గా తీసుకోవడం వల్లే ఇలా భారీ మొత్తం పెండింగ్ పడిందని వాపోతున్నారు.