నో టెన్షన్‌.. మరో నెల గడువు..

నో టెన్షన్‌.. మరో నెల గడువు..

ఇవాళే కేబుల్ ప్రసారాలు నిలిచిపోతున్నాయన్న టెన్షన్ అవసరం లేదు... కాస్త రిలాక్స్ కావొచ్చు. ఎందుకంటే.. మీకు ఇచ్చిన ఛానళ్లను ఎంపిక చేసుకునేందుకు మరో నెల గడువు పొడిగించారు. ప్రసారాలు, కేబుల్‌ సర్వీసులపై రూపొందించిన కొత్త విధివిధానాల అమలులో భాగంగా ఇష్టమైన ఛానళ్లనే ఎంపిక చేసుకునేందుకు 2019 జనవరి 31 దాకా గడువు పొడిగిస్తున్నట్లు భారత టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్‌) వెల్లడించింది. నిన్న ప్రసార సంస్థలు, డీటీహెచ్‌ ఆపరేటర్లు, ఎంఎస్‌వోలతో సమావేశమైన ట్రాయ్‌ కార్యదర్శి ఎస్‌కే గుప్తా... వారితో చర్చల అనంతరం ఈ విషయాన్ని ప్రకటించారు. కొత్త విధివిధానాలను అమలు చేసేందుకు అందరూ సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు. ఈ ప్రక్రియ సాఫీగా, అంతరాయాలు    తలెత్తకుండా మార్పిడి జరిగేందుకు కొంత సమయం కావాలని కోరారని... దీంతో వినియోగదారుల అభిప్రాయాల కోసం జనవరి 31వ తేదీ వరకు అవకాశం కల్పించినట్టు తెలిపారు. దీంతో వినియోగదారులకు, కేబుల్ ఆపరేటర్లకు కాస్త ఊరట దక్కింది... వివరాలు సేకరణకు కేబుల్ ఆపరేటర్లకు... నచ్చిన చానెల్ ఎంపిక చేసుకోవడానికి వినియోగదారునికి అవకాశం దక్కింది.