ప్రభుత్వ రంగ టెలికాంల 4జీ కలలపై నీళ్లు చల్లిన ట్రాయ్

ప్రభుత్వ రంగ టెలికాంల 4జీ కలలపై నీళ్లు చల్లిన ట్రాయ్

టెలికామ్ నియంత్రణ సంస్థ ట్రాయ్ ప్రభుత్వ రంగ టెలికామ్ సంస్థలకు పెద్ద షాకిచ్చింది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్), మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్) లకు 4జీ ఎయిర్ వేవ్స్ కేటాయించాలని తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రాలేదని తెలిపింది. 

ట్రాయ్ లోని ఓ సీనియర్ అధికారి చెప్పిన మాటలు డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(డీఓటీ) ప్రకటన పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. 4జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల విషయాన్ని ట్రాయ్ పరిశీలనకు పంపినట్టు గత నెల డీఓటీ చెప్పింది. 'బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ లకు 4జీ స్పెక్ట్రమ్ లపై డీఓటీ నుంచి మాకెలాంటి సిఫార్సు రాలేదు' అని ఆ అధికారి ఎకనామిక్ టైమ్స్ వార్తాపత్రికకు స్పష్టంగా చెప్పారు.  

అసలే పుట్టెడు నష్టాలు, రూ.35,000 కోట్ల అప్పులతో కునారిల్లుతున్న ప్రభుత్వ రంగ టెల్కోలకు 4జీ స్పెక్ట్రమ్ కేటాయింపులపై ఈ వ్యాఖ్యలతో అనుమాన మేఘాలు కమ్ముకుంటున్నాయి. ప్రైవేట్ సంస్థలు రిలయన్స్ జియో, భారతి ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియాలతో పోటీపడే వాణిజ్యపరంగా 4జీ సేవలను ప్రారంభించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వ అనుమతుల కోసం ప్రభుత్వ రంగ టెల్కోలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. గత నెల 1,70,000కి పైగా ఉద్యోగులున్న బీఎస్ఎన్ఎల్ ఉద్యోగ సంఘాలు మూడు రోజుల సమ్మెకి వెళ్తామని హెచ్చరించింది. దీనికి ప్రధాన కారణంగా తమకు 4జీ ఎయిర్ వేవ్స్ ఇవ్వడంపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకపోవడాన్ని చెప్పారు.

రెండు టెల్కోలకు 4జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, పరిమాణం, ధర, ఫ్రీక్వెన్సీ పరిధిపై నియంత్రణ సంస్థ సిఫార్సు చేస్తుందని టెలికామ్ శాఖ చెబుతుంటే తమకు అసలు అలాంటి సమాచారమే లేదని, అలాంటి సిఫార్సే వస్తే వీలైనంత త్వరగా సలహాలు ఇచ్చేవారమని ట్రాయ్ అంటోంది.