మోడీ బయోపిక్ కోసం రైలు పెట్టెను తగలపెట్టారు

మోడీ బయోపిక్ కోసం రైలు పెట్టెను తగలపెట్టారు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తీస్తున్న డాక్యుమెంటరీ కోసం ఒక ఉపయోగించని రైలు పెట్టెను ఆదివారం తగులపెట్టారు. మోడీ జీవితంలో అత్యంత కీలకమైన 2002లో జరిగిన గోధ్రా రైలు తగులపెట్టే సంఘటనను చూపించేందుకు ఇలా చేసినట్టు తెలిసింది.

డాక్యుమెంటరీ చిత్రం నిర్మిస్తున్న బృందానికి పశ్చిమ రైల్వేకి చెందిన ఒక మాక్ డ్రిల్ బోగీని ఇచ్చారు. దానిని యధాతథంగా తిరిగి అప్పజెప్పాలన్న షరతుపై చిత్ర యూనిట్ కి ఇవ్వగా వారు దానిని మంటలు పెట్టి తగులపెట్టినట్టు రైల్వే అధికారులు చెప్పారు. ఇందుకోసం వారి నుంచి డబ్బు వసూలు చేసినట్టు వడోదరా రైల్వే డివిజన్ ప్రతినిధులు తెలిపారు.

గోధ్రా రైలు తగులపెట్టే సన్నివేశాన్ని పశ్చిమ రైల్వేలలోని ప్రతాప్ నగర్ స్టేషన్ లో చిత్రీకరించారు. ఇందుకోసం కోచ్ కేర్ సెంటర్ దగ్గర ఒక సెట్ నిర్మించినట్టు డాక్యుమెంటరీ డైరెక్టర్ ఉమేష్ శుక్లా తెలిపారు. ప్రతాప్ నగర్, విశ్వామిత్రి స్టేషన్ల మార్గంలోని బ్రాడ్, నేరోగేజ్ రూట్లలో నాలుగు రోజుల షూటింగ్ కోసం  డాక్యుమెంటరీ నిర్మాతలకు అనుమతులు ఇచ్చారు.

ఈ పెట్టెను బయటి నుంచి రైలు తగులపెట్టే సన్నివేశాన్ని షూట్ చేసేందుకు ఉపయోగించినట్టు గుజరాత్ లో షూటింగ్ పర్యవేక్షిస్తున్న ఎగ్జిక్యూటివ్ జయ్ రాజ్ గఢ్వీ తెలిపారు. 2002 గోధ్రా సంఘటనకు సంబంధించిన కోచ్ లోపలి సన్నివేశాలను చిత్రీకరించేందుకు ముంబైలో ప్రత్యేకంగా సెట్ నిర్మిస్తున్నట్టు చెప్పారు.

ఫిబ్రవరి 27, 2002లో జరిగిన గోధ్రా రైలు తగులపెట్టిన సంఘటనలో 59 మంది కరసేవకులు మరణించారు. దీంతో గుజరాత్ చరిత్రలోనే అత్యంత దారుణమైన మతపరమైన అల్లర్లు చెలరేగి 1,000 మందికి పైగా చనిపోయారు. ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.