వందే భారత్ ఎక్స్ ప్రెస్ కంటే విమానమే చౌక

వందే భారత్ ఎక్స్ ప్రెస్ కంటే విమానమే చౌక

భారతదేశంలో అత్యధిక వేగంతో ప్రయాణించే రైలు.. ట్రెయిన్ 18 లేదా వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఎక్కారంటే జేబుకు పెద్ద చిల్లు పడటం ఖాయం. ఢిల్లీ నుంచి వారణాసి మధ్య నడిచే ఈ రైలుని ఫిబ్రవరి 15న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు. ఇందులో ఛెయిర్ కార్ టికెట్ ధర రూ.1,850, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ రూ.3,520గా నిర్ణయించారు. ఇందులో కేటరింగ్ చార్జీలు కూడా కలిపారు. రెండు క్లాసుల్లో ఆహార ధరలు వేర్వేరుగా ఉంటాయి. వారణాసి నుంచి ఢిల్లీకి వచ్చేటపుడు మీకు తక్కువ టికెట్ పడుతుంది. చెయిర్ కార్ అయితే రూ.1,795, ఎగ్జిక్యూటివ్ క్లాస్ కి రూ.3,470 చెల్లించాలి. ఇది శతాబ్ది ఎక్స్ ప్రెస్ కి ఒకటిన్నర రెట్లు ఎక్కువ. వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధర ఇతర ప్రీమియం ట్రెయిన్ టికెట్ల వెల కంటే 40% ఎక్కువ. ఈ రైలు వారంలో 5 రోజులు మాత్రమే నడుస్తుంది. సోమవారం-గురువారం ఈ ట్రెయిన్ ని మెయింటెనెన్స్ కి పంపిస్తారు.

1. ఢిల్లీ నుంచి నడిచే ఈ సెమీ హైస్పీడ్ ట్రెయిన్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిబ్రవరి 15న ఢిల్లీలో ప్రారంభిస్తారు. ఈ ట్రెయిన్ లో 16 ఏసీ కోచ్ లు ఉంటాయి.

2. ఈ రైలు న్యూఢిల్లీ స్టేషన్ నుంచి ఉదయం 6 గంటలకు బయల్దేరుతుంది. మధ్యాహ్నం 2 గంటల కల్లా వారణాసి చేరుతుంది. మధ్యలో కాన్పూర్, ప్రయాగరాజ్ స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. ఉదయం 10.20 నిమిషాలకు కాన్పూర్, మధ్యాహ్నం 12.25కి ప్రయాగరాజ్ స్టేషన్లలో ఆగుతుంది.

3. వారణాసి నుంచి ఈ రైలు మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరుతుంది. రాత్రి 11కి న్యూఢిల్లీ స్టేషన్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ సాయంత్రం 4.35కి ప్రయాగరాజ్, 6.30కి కాన్పూర్ లలో ఆగుతుంది.

4. మేకిన్ ఇండియా కార్యక్రమం కింద చెన్నైలో తయారైన ఈ రైలుని రూపొందించేందుకు దాదాపు రూ.100 కోట్లు ఖర్చయ్యాయి. దీని తయారీకయ్యే ఖర్చు చాలా తక్కువగా ఉండటంతో ఇతర దేశాల సంస్థలు కూడా ఈ రైలు కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నాయి.