ట్రిపుల్ తలాఖ్ బిల్లుపై కాసేపట్లో ఓటింగ్

ట్రిపుల్ తలాఖ్ బిల్లుపై కాసేపట్లో ఓటింగ్

సుదీర్ఘ క్రిస్మస్ సెలవు విరామం తర్వాత పార్లమెంట్ శీతాకాల సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. షెడ్యూల్ ప్రకారం లోక్ సభలో ట్రిపుల్ తలాఖ్ బిల్లుపై చర్చ ప్రారంభమైంది. మేకేదతు అంశంపై ఏఐఏడిఎంకె, రాఫెల్ డీల్ పై జెపిసి దర్యాప్తు కోరుతూ కాంగ్రెస్ రెండుసార్లు సభకు అంతరాయం కలిగించాయి. సభను ఏడు గంటల వరకు కొనసాగించనున్నట్టు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. ప్రస్తుతం సభలో ట్రిపుల్ తలాఖ్ అంశంపై వాడివేడిగా చర్చ కొనసాగుతోంది. వివిధ పార్టీల నాయకులు బిల్లుపై సలహాలు, సూచనలు చేస్తున్నారు. 

ప్రత్యేకంగా ఏ మతాన్ని లక్ష్యంగా చేసుకొని ట్రిపుల్ తలాఖ్ బిల్లు తీసుకురావడం లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. దేశంలోని మహిళలందరికీ న్యాయం చేసేందుకు, మానవత్వాన్ని ప్రోత్సహించేందుకే ఈ బిల్లు తీసుకొచ్చినట్టు ఆయన తెలిపారు. చిన్నచిన్న కారణాలకు ట్రిపుల్ తలాఖ్ చెబుతుండటంతో సుప్రీంకోర్ట్ చెప్పినా ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చిందని మంత్రి వివరించారు. 20 ఇస్లామిక్ దేశాలు ట్రిపుల్ తలాఖ్ ను నిషేధించాయని.. మన దేశంలో ఎందుకు కొనసాగించాలని ప్రశ్నించారు. 

ట్రిపుల్ తలాక్ బిల్లును క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకు జాయింట్ సెలెక్ట్ కమిటీకి పంపాల్సిందిగా ప్రతిపక్షాలు కోరాయి. ఏఐఏడిఎంకె నేత పి వేణుగోపాల్, తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన సుదీప్ బంధోపాధ్యాయ్, ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ, ఎన్సీపీకి చెందిన సుప్రియా సూలే ఈ డిమాండ్ ను లేవనెత్తారు. రాజ్యాంగపరమైన అంశం కావడంతో ఎంతో కీలకమైన బిల్లుపై క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉందని కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ముస్లిం మహిళల సాధికారత పేరుతో ముస్లిం పురుషులపై క్రిమినల్ కేసులు పెట్టే అవకాశాన్ని అందిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్ విమర్శించారు. ఈ చట్టం దుర్వినియోగం కాకుండా చూసే భద్రతా చర్యలు లేవని బీజేడీ సభ్యుడు రబీంద్ర జెనా అభిప్రాయపడ్డారు. లింగ న్యాయం పేరులో ప్రాథమిక హక్కులపై దాడి జరుగుతోందని ఏఐఏడిఎంకెకి చెందిన అనాహర్ రాజా ఆరోపించారు. ముస్లిం మహిళలకు న్యాయం చేయాలనుకుంటే ముందుగా మతపరమైన హింసాకాండను అధికార బీజేపీ అరికట్టాలని సీపీఐ(ఎం) నేత మొహమ్మద్ సలీం సూచించారు.

ఇలాంటి బిల్లుని సభ ఇప్పటికే చర్చించి ఆమోదించినందువల్ల కమిటీకి పంపాలన్న డిమాండ్ ను అంగీకరించేది లేదని స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పష్టం చేశారు.