మొతేరా పిచ్‌పై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌

మొతేరా పిచ్‌పై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌

మొతేరా పిచ్‌పై ట్రోల్స్‌ పడుతున్నాయ్‌. సోషల్‌ మీడియాలో నెటిజన్లు సెటైర్లు గుప్పిస్తున్నారు. కేవలం రెండు రోజుల్లో మ్యాచ్‌ ముగియడంతో మీమ్‌లతో ముంచెత్తారు. బ్రిటీష్‌ మీడియా అయితే ఇంగ్లండ్‌ జట్టు ఓటమికి పిచ్‌పైనే నింద మోపుతోంది. అటు మైకెల్‌వా కామెంట్స్‌ కొత్త రగడను రాజేసింది. 

ఐదు రోజుల టెస్ట్‌ మ్యాచ్‌.. జస్ట్‌ రెండు రోజుల్లో ముగిసిపోయింది. ఇదే ఇప్పుడు రచ్చకు కారణమైంది. మొతేరా పిచ్‌ఫై విమర్శలు పెరుగుతున్నాయ్‌. బ్రిటీష్‌ మీడియా అయితే పిచ్‌ కారణంగానే తమ జట్టు ఓడిపోయిందని.. భగ్గుమంటోంది. అసలు టెస్ట్‌ మ్యాచ్‌కి పనికిరాని పిచ్‌ తయారు చేశారంటూ రెచ్చిపోయింది. ఇక మైకెల్‌ వా అయితే.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాసిరకం పిచ్‌లతో భారత్‌ టెస్ట్‌ క్రికెట్‌ను సర్కార్‌లా మార్చేస్తోందని అన్నారు. దీనిపై రగడ రాజుకుంది. 

మరోవైపు సోషల్‌ మీడియాలోనూ జోరుగా ట్రోల్‌ పడుతున్నాయ్‌. మీమ్‌లు ముంచెత్తుతున్నాయ్‌. ఇప్పుడే మొదలైంది.. అప్పుడే అయిపోయిందా..? అంటూ మీమ్‌లు సందడి చేస్తున్నాయి. ఇక కొందరు అయితే నాలుగో టెస్ట్‌కి కూడా పిచ్‌ రెడీ అవుతోందంటూ.. నాగళ్లతో దుక్కి దున్నే ఫోటోలు పెట్టారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్షా గోయెంకా కూడా ఈ జాబితాలో చేరిపోయారు. 

మ్యాచ్‌ 3 రోజుల్లో ముగుస్తుందా..? 4 రోజుల్లో ముగుస్తుందా..? అని విశ్లేషకులు అంచనాలు వేస్తుంటే.. అనూహ్యంగా రెండో ముగిసిందంటూ నెటిజన్లు మరో మీమ్‌ వదిలారు. ఇక టీమిండియా ఇంగ్లండ్‌ టూర్‌కి వెళ్తే.. ఇలాంటి పిచ్‌లే రెడీ చేస్తారంటూ.. గడ్డి బాగా ఉన్న మైదానాల ఫోటోలు పోస్ట్‌ చేశారు. ఇలా మొతేరా ట్రోల్స్‌ మోతెక్కిపోతున్నాయి. అసలు ఈ పిచ్‌ ఎలా చేశారో తెలుసా..? అంటూ వదిలిన వీడియో ట్రెండ్‌ అవుతోంది. 

ఐదు రోజుల టెస్ట్‌ను కాపాడేందుకు పింక్‌బాల్‌ టెస్ట్‌లను తీసుకొస్తే.. దానిని రెండు రోజుల్లో ముగించడంతో.. కొందరు మా టిక్కెట్ల పరిస్థితేందంటూ ట్వీట్లు చేస్తున్నారు. మూడు రోజుల టిక్కెట్ల డబ్బులు రీఫండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.