స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్రిక్తత

స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్రిక్తత

నల్లగొండలో స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.  పోలింగ్ సందర్భంగా టీఆర్ఎస్- కాంగ్రెస్ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఉదయం పోలింగ్‌ ప్రారంభమైన తర్వాత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ క్లాక్‌టవర్‌ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే  భూపాల్‌రెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. ఇద్దరు నేతలు ఎదురుపడటంతో వారి అనుచరులు పరస్పరం నినాదాలు చేసుకున్నారు. ఎవరికివారు తమ నేతకు అనుకూలంగా పెద్దపెట్టున నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. కోమటిరెడ్డి గోబ్యాక్ అంటూ టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితి అదుపు చేశారు.

శుక్రవారం వరంగల్‌, నల్లగొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు ఈ మూడు స్థానాల కోసం పోటీ పడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఈ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ జూన్‌ 3న జరుగుతుంది. నల్లగొండలో తేరా చిన్నపరెడ్డి (టీఆర్ఎస్) కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి (కాంగ్రెస్‌) బరిలో ఉన్నారు.