సారు కారు 16 కాదు...

సారు కారు 16 కాదు...

సారు కారు 16.. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నినాదం... రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో ఒకటి ఎంఐఎం గెలిస్తే... మిగతా 16 స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టించాలని ప్రయత్నించిన టీఆర్ఎస్‌కు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ బ్రేకులు వేశాయి. టీఆర్‌ఎస్‌ అత్యంత కీలకంగా భావించిన  పార్లమెంట్ ఎన్నికల్లో... తెలంగాణలో బీజేపీ పాగావేసింది. కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ ఫలితాలు జోష్ నింపాయి. టీఆర్ఎస్ 9 స్థానాల్లో విజయం సాధిస్తే... బీజేపీ 4, కాంగ్రెస్‌ 3, ఎంఐఎం ఒక స్థానం దక్కించుకొన్నాయి. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ భారీ విజయాన్ని నమోదు చేయడంతో లోక్‌సభ ఎన్నికల్లో ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయని భావించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్‌లోకి క్యూ కట్టడంతో ఇక టీఆర్ఎస్‌కు తిరుగులేదన్నారు. ఇక ఒక్క ఎమ్మెల్యే స్థానమే గెలిచిన బీజేపీ.. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావమే చూపలేదనే చర్చసాగింది. కానీ, అంచనాలు తలకిందులు చేస్తూ... బీజేపీ, కాంగ్రెస్ ఏకంగా 7 స్థానాలను సొంతం చేసుకున్నాయి. 

టీఆర్ఎస్‌కు కంచుకోట అయిన కరీంనగర్‌లో సీనియర్‌ ఎంపీ బి. వినోద్‌కుమార్‌, నిజామాబాద్‌లో ప్రస్తుత ఎంపీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె కవిత, అలాగే భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, ఆదిలాబాద్‌ ఎంపీ గడెం నగేష్‌ ఓటమిపాలయ్యారు. బీజేపీ చేతుల్లో ఓటమి పాలు కావడం, కాంగ్రెస్‌లో ముఖ్యనాయకులు మూడు లోక్‌సభ స్థానాలు గెలవడం టీఆర్ఎస్‌ వర్గాలను విస్మయానికి గురి చేసింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో పోటీచేసిన టీఆర్ఎస్... హైదరాబాద్ స్థానంలో మాత్రం ఎంఐఎంతో స్నేహపూర్వక పోటీ... మిగతా16 స్థానాల్లో పోటీచేసి.. క్లీన్‌స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేసింది. కానీ, రెండంకెల సంఖ్యకు చేరుకోలేకపోయింది. 2014లో 11 లోక్‌సభ స్థానాలను, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 14 లోక్‌సభ స్థానాల పరిధిలో మెజార్టీ సాధించగా, ఇప్పుడు తొమ్మిదింటికే పరిమితమైంది. ఉత్తర, దక్షిణ తెలంగాణలుగా చూసి విశ్లేషిస్తే ఉత్తర తెలంగాణలోని కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ స్థానాల్లో ఆ పార్టీ ఓడిపోయింది. దక్షిణ తెలంగాణలోని ముఖ్య స్థానాలైన నల్గొండ, భువనగిరిలలోనూ ఓటమి చవిచూసింది. గ్రేటర్ పరిధిలోని చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌ స్థానాల్లో చుక్కెదురయింది. గత శాసనసభ ఎన్నికల్లో దాదాపు 14 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో మెజారిటీ శాసనసభ స్థానాలను గెలిచిన టీఆర్‌ఎస్‌కు ఈసారి తక్కువ స్థానాలే వచ్చాయి.