నేడు గులాబీ మేనిఫెస్టో విడుదల...

నేడు గులాబీ మేనిఫెస్టో విడుదల...

అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్... ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు... తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2.30 గంటలకు ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సమావేశం కానుంది... అనంతరం గులాబీ దళపతి కేసీఆర్‌ మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించడంతో ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థులు ముందున్నారు. అయితే ఇప్పటి వరకు మేనిఫెస్టో ఖరారు చేయలేదు. దసరా పండుగత తర్వాత పూర్తిస్థాయి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయాలని భావించారు... కానీ, ముందే కొన్ని కీలక అంశాలను ప్రకటించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. పింఛన్ల పెంపు, ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ సాయం, కొత్త పథకాలు, మరోవైపు రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి వంటీ కీలక అంశాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఇవాళ మధ్యాహ్నం జరిగే సమావేశంలో మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ కె.కేశవరావుతో పాటు 15 మంది సభ్యులు పాల్గొని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇప్పటికే ఈ కమిటీ మంత్రులు, సభ్యులు, వివిధ సంఘాలు, వేదికలు, సమాఖ్యలు, సంస్థలతో పాటు ప్రజల నుంచి పలు ప్రదిపాధనలు స్వీకరించింది. మరోవైపు రాష్ట్రంలోని వివిధ రాజకీయ  పార్టీలు కూడా టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.