నల్లమల గుప్తనిధుల వేట..టీఆర్ఎస్ నేత అరెస్ట్

నల్లమల గుప్తనిధుల వేట..టీఆర్ఎస్ నేత అరెస్ట్


అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ అటవీ రేంజ్‌ పరిధిలో గుప్త నిధుల తవ్వకాలలో టీఆర్ఎస్ నేత హస్తం ఉండడం సంచలనంగా మారింది. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ కి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు పి.తిరుమలేష్‌ నాయుడు అండ్ కో ఆమ్రాబాద్‌ రిజర్వ్ ఫారెస్ట్‌లోకి అనుమతి లేకుండా ప్రవేశించారు. నిజానికి సాయంత్రం 6 గంటల తర్వాత టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లోకి వెళ్లడం నిషేధం. ఎటువంటి వాహనాలకు అనుమతి ఉండదు. కానీ తిరుమలేష్ నాయుడు మాత్రం వాహనంతో పాటు తన మనుషులతో అడవుల్లోకి ప్రవేశించాడు.

తన సహాయకులు ఎల్లప్ప, బాలస్వామి, శ్రీనులతో పాటు డ్రైవర్‌ షహబాజ్‌ అలీతో కలిసి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లోకి వెళ్లి అక్కడ స్ధానికులను మభ్యపెట్టి భ్రమరాంబికా దేవి విగ్రహాన్ని పూర్తిగా పెకిలించి గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టినట్లు తేలింది. ఈరోజు తెల్లవారుజామున స్కార్పియో వాహనంలో వెనుతిరిగిన క్రమంలో స్థానిక గిరిజనులు ఫారెస్ట్‌ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఫారెస్ట్ లోకి అనుమతితోనే వెళ్లానని తిరుమలేష్ చెప్తున్నారు. రేంజర్, డీఎఫ్‌ఓ అనుమతితోనే తాను అడవుల్లోకి వెళ్లానని చెబుతున్నారు. అయితే రాత్రిపూట అడవిలోకి వచ్చారని, అక్కడే వండుకుని తిన్న తర్వాత వెళ్ళిపోయి మళ్ళీ అర్ధరాత్రి దాటిన తర్వాత మళ్లీ ఆలయం దగ్గరికి వచ్చారని వారు చెప్తున్నారు. స్థానికుల దగ్గర ఓ వ్యక్తి ఉండి మిగిలినవాళ్లంతా ఆలయంలోకి వెళ్లి తవ్వకాలు జరిపారని వాళ్లు తెలిపారు.