షర్మిలతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడి భేటీ.. ఇలా స్పందించిన ఎమ్మెల్యే..

షర్మిలతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడి భేటీ.. ఇలా స్పందించిన ఎమ్మెల్యే..

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల.. వరుసగా అందరినీ కలుస్తూ వస్తున్నారు.. వైఎస్ అభిమానులు పేరిట నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూనే.. మరికొందరు మాజీ ఐఏఎస్, ఐపీఎస్‌లు, రాజకీయ నేతలు సైతం వచ్చి షర్మిలను కలిసి వెళ్తున్నారు.. ఇదే సమయంలో.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య కుమారుడు కాలె రవికాంత్.. వైఎస్ షర్మిలను కలిశారు.. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలు అలాగే తాజా పరిణామాల మీద ఎమ్మెల్యే కుమారుడితో షర్మిల చర్చలు జరిపారనే వార్త హాట్ టాపిక్‌గా మారింది.. అయితే, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య.. తాను వైఎస్ అభిమానిని అని చెప్పుకుంటారు.. నేరుగా వెళ్లి కలిస్తే ఇబ్బంది అవుతుందని భావించి కొడుకును పంపారా? అనే గుసగుసలు కూడా వినిపించాయి.. ఈ వార్తలు హల్ చల్ చేయడంతో.. వివరణ ఇచ్చారు ఎమ్మెల్యే కాలె యాదయ్య.. 

2 రోజుల క్రితం తన కుమారుడిపై వచ్చిన వార్తకు స్పందించిన ఎమ్మెల్యే యాదయ్య.. కొందరు కావాలని నాపై, నా కుటుంబంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై ఉన్న అభిమానంతోనే నా కుమారుడు.. వైఎస్ షర్మిలను కలిశారని.. ఇందులో రాజకీయ కారణాలు లేవని స్పష్టం చేశారు.. నేను, నా కుటుంబం ఎప్పుడూ టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటామని.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని క్లారిటీ ఇచ్చారు.. అభిమానం వేరు.. రాజకీయం వేరు.. రెండింటికీ ముడిపెట్టొద్దన టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. అవసరం అయితే రాజకీయలను సైతం వదులుకుంటాం.. కానీ, టీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్‌ను విడవబోం అని స్పష్టం చేశారు.