షాకింగ్ : ష‌ర్మిల‌తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు భేటీ

షాకింగ్ : ష‌ర్మిల‌తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు భేటీ

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టే సూచనలు అధికంగానే కనిపిస్తున్నాయి. ఈ విషయం మీద ఆమె నేరుగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా ఆమె వైఎస్ అభిమానులు పేరిట నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు, ఆ సమ్మేళనలలో వైఎస్ అభిమానులతో చేస్తున్న వ్యాఖ్యానాలు ఖచ్చితంగా ఆమె పార్టీ పెట్టి తీరుతుందని సూచనలు పంపుతున్నాయి. బహుశా మే నెలలో ఆమె పార్టీ అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తోంది..అయితే పార్టీ ప్రకటించే దానికంటే ముందు ప్రతి జిల్లాకు సంబంధించిన వైఎస్ అభిమానులతో ఆమె సమావేశం అవుతున్నారు.

ముందుగా ఉమ్మడి నల్గొండ జిల్లా వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన ఆమె ఇటీవల హైదరాబాద్ - రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల వైఎస్ అభిమానులతో సమావేశమై చర్చలు జరిపారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది, దానికి మీరు సమర్ధిస్తున్నారా అనే విధంగా ప్రశ్నలు ఉన్న ఫీడ్ బ్యాక్ ఫామ్స్ కూడా ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే షర్మిల హాట్ టాపిక్ గా మారి గా అధికార టీఆర్ఎస్ కూడా షర్మిల పార్టీ పెట్టడం జీర్ణించుకోలేకపోతోంది. అందుకే కొందరు నేతలు ఆమె పార్టీని నేరుగా కాకపోయినా పరోక్షంగా అయినా విమర్శిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడు ఒకరు షర్మిలను కలవడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

వైయస్ రాజశేఖర్ రెడ్డి గతంలో పాదయాత్ర ప్రారంభించిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కుమారుడు కాలే రవికాంత్ వైఎస్ షర్మిల లోటస్ పాండ్ లో కలిసారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలు అలాగే తాజా పరిణామాల మీద ఎమ్మెల్యే కుమారుడితో షర్మిల చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వాస్తవానికి కాలే యాదయ్య కూడా ఎన్నోసార్లు తాను వైయస్ అభిమానిని అని చెప్పుకుంటూ ఉన్నారు. మరి తాను నేరుగా వెళ్లి కలిస్తే ఇబ్బంది అవుతుందని భావించి కొడుకును పంపారా ? లేక వైఎస్ అభిమానుల లాగా ఆహ్వానం అందింది కాబట్టి కాదనలేక వెళ్లి కలిసి వచ్చారా అనే దాని మీద క్లారిటీ రావాల్సి ఉంది. ఎంపీపీగా మొదలుపెట్టి జెడ్పీటీసీగా గెలిచిన కాలే యాదయ్య తాను వైఎస్ అభిమానిని గతంలో చాలా సార్లు చెప్పుకున్నారు. దానికి కారణం వైయస్ పట్టుబట్టి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు చేవెళ్ల నియోజకవర్గం టికెట్ ఇప్పించడమే. మొదటి సారి ఓడిపోయినా సరే ఆయన 2014, 2018 రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మారిన పరిణామాల నేపథ్యంలో ఆయన టి.ఆర్.ఎస్.లో చేరి జిల్లాలో కీలక నేతగా ఎదిగారు.