కేసీఆర్‌పై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్‌పై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు

డీఎస్‌తో పాటు తనపై నిజామాబాద్ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేసిన తర్వాత మౌనంగా ఉన్న ఎమ్మెల్సీ భూపతిరెడ్డి... తొలిసారి నోరువిప్పి... సంచలన వ్యాఖ్యలు చేస్తూ టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు... రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేస్తానని వార్నింగ్ ఇచ్చిన ఆయన... నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డిని ఓడిస్తానంటూ సవాల్ చేశారు. నిజామాబాద్ రూరల్ నుంచి తాను పోటీ చేయబోతున్నాను, టీఆర్ఎస్ టికెట్ ఇచ్చినా పోటీ చేయను, ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తా నన్న భూపతిరెడ్డి... ఏ పార్టీ అనేది త్వరలో చెబుతానన్నారు.

ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తే తాను కూడా ఇప్పుడే రాజీనామా చేస్తానని... లేకపోతే చేయను అన్నారు భూపతిరెడ్డి... నేను తప్పు చేస్తే ఎందుకు సస్పెండ్ చేయరు క్షమాపణ ఎందుకు చెప్పరు? అని ప్రశ్నించిన ఆయన... పొమ్మనలేక పొగ పెడుతున్నారంటూ మండిపడ్డారు. టీఆర్ఎస్ ఏ ముఖం పెట్టుకొని ముందస్తు ఎన్నికలకు పోతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన భూపతిరెడ్డి... టీఆర్ఎస్ పతనం నిజామాబాద్ నుంచే మొదలవుతోందన్నారు. ఇక కేబినెట్‌లో 70 శాతం మంది కేసీఆర్‌ను తిట్టినవారే ఉన్నారని... ఉద్యమ ద్రోహులకు పెద్దపీట వేశారన్నారు. తెలంగాణ ఉద్యమకారులను పథకం ప్రకారం టీఆర్ఎస్ పక్కన పెడుతోందని ఆరోపించారు. టీఆర్ఎస్ చెప్పిందే వినాలి, లేకపోతే ద్రోహులు అనే ముద్ర వేసే పద్ధతి ఉందని విమర్శించిన భూపతిరెడ్డి... నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో ఆ మూడు జరగడంలేదన్నారు. కాగా, డీఎస్‌తో పాటు భూపతిరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.