కాంగ్రెస్ నేతలు దుర్బుద్ధి ప్రదర్శిస్తున్నారు

కాంగ్రెస్ నేతలు దుర్బుద్ధి ప్రదర్శిస్తున్నారు

కాళేశ్వరంపై కాంగ్రెస్ నేతలు దుర్బుద్ధి ప్రదర్శిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రతిష్టను కాంగ్రెస్ నేతలు దిగజారుస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రావొద్దని కాంగ్రెస్ నేతలు అనడం వారి కుటిల నీతికి నిదర్శనమని అన్నారు. జగన్‌ను రావొద్దంటున్న కాంగ్రెస్ నేతలు మోడీ ప్రమాణ స్వీకారానికి సోనియా, రాహుల్ హాజరవ్వడాన్ని కూడా తప్పుపడుతున్నారా? అని ఆయన ప్రశ్నించారు. మోడీని మిషన్‌ భగీరథ ప్రారంభానికి రావొద్దని ఉత్తమ్‌ లేఖ రాశారని గుర్తుచేశారు. మోడీ ప్రమాణస్వీకారానికి సోనియా, రాహుల్‌ వెళ్లడాన్ని కాంగ్రెస్‌ నేతలు తప్పుపట్టగలరా? అని ప్రశ్నించారు. కాళేశ్వరాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నేతలు ఆ నీటిని వాడుకోవద్దని కార్యకర్తలకు పిలుపునిస్తారా? అని మండిపడ్డారు. తెలంగాణ రైతుల కాళ్లు కడిగి.. కన్నీళ్లు తుడవనున్న కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల కాంగ్రెస్ ఇదే తీరుగా వ్యవహరిస్తే.. ప్రజాక్షేత్రంలో ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందన్నారు. నిర్వాసితులకు చక్కని ప్యాకేజీ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కోర్టుకెళ్లిందని అన్నారు. శ్రీశైలం నిర్వాసితులకు కాంగ్రెస్ హయాంలో న్యాయం జరగక ఇప్పటికీ తిరుగుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.