ఆర్టీసీ సమ్మె: ఆ ఒక్కటి తప్ప.. అన్ని డిమాండ్లు పరిశీలించాలి..!

ఆర్టీసీ సమ్మె: ఆ ఒక్కటి తప్ప.. అన్ని డిమాండ్లు పరిశీలించాలి..!

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ తప్ప ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన మిగతా అన్ని డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని కోరారు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు (కేకే).. ఆర్టీసీ కార్మికుల సమ్మె, ఆత్మహత్యలపై స్పందించిన కేకే.. కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం తనను ఎంతగానో బాధించిందన్నారు.. అయితే, ఆత్మహత్యలతో ఏ సమస్య పరిష్కారం కాదని హితవుపలికారు. ఇక, సమ్మె ఉధృతమై పరిస్థితులు చేదాటకముందే సమ్మె విరమించాలని.. చర్చలకు రావాలని కోరారు. మరోవైపు ఆర్టీసీ కార్మికులు, సంస్థ పరిరక్షణకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలపై ప్రశంసలు కురిపించారు కేకే.. ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్‌మెంట్,16 శాతం ఐఆర్ ఇచ్చిన ఘనత తమ సర్కార్‌దేనన్న ఆయన.. ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని సీఎం అన్నారని.. అందుకు ఆయనను అభినందిస్తున్నట్టు వెల్లడించారు.