'ఎర్రకోటపై గులాబీ జెండా ఎగురవేస్తాం'

'ఎర్రకోటపై గులాబీ జెండా ఎగురవేస్తాం'

ఢిల్లీలోని ఎర్రకోటపై గులాబీ జెండా ఎగురవేస్తామన్నారు టీఆర్ఎస్ ఎంపీ, కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్. కరీంనగర్‌లో మీట్‌ ది ప్రెస్‌లో పాల్గొన్న ఆయన... రాష్ట్రంలోని 16 స్థానాల్లో విజయం సాధిస్తామని... ఎర్రకోటపై గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. నా స్థానికతపై పొన్నం ప్రభాకర్ కు మాట్లాడే అర్హత లేదన్నారు. ఆ మాటకొస్తే సోనియాగాంధీ గురంచి పొన్నం ఏం చెబుతారు? అని ప్రశ్నించారు. తెలంగాణను ఉద్యమంగా అభివృద్ధి చేస్తున్నాం కాబట్టే ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్‌లోకి వస్తున్నారని స్పష్టం చేశారు వినోద్. 

2014 ఎన్నికల్లో అత్యధిక ఓట్లతో గెలిచిన అభ్యర్థిగా రికార్డు బ్రేక్ చేశాను.. గత పార్లమెంట్‌లో అత్యధిక సార్లు చర్చల్లో పాల్గొన్నా.. హైదరాబాద్ నుంచి కరీంనగర్ కు రైల్వే లైన్ కోసం పోరాడి సాధించాను. పనులు కూడా జరుగుతున్నాయన్నారు వినోద్. కరీంనగర్ ను కాజీపేట జంక్షన్ కంటే పెద్ద కూడలిగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నానని తెలిపిన ఆయన... కరీంనగర్ ను స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చేందుకు శ్రమించానని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల కోసం నెలల తరబడి ఢిల్లీలో ఉండి సాధించాం.. పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన ప్రతీ బిల్లుపై టీఆర్ఎస్ ఎంపీలు చర్చించారని గుర్తుచేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు సాధించామన్నారు. ఇక పోలవరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ జాతీయ హోదా ఇవ్వడం పెద్ద తప్పిదం అన్నారు వినోద్... విభజన చట్టంలోని హామీలను, కొన్ని ఇవ్వని హామీలు కూడా సాధించామని.. తెలంగాణకు అన్యాయం జరుగుతోందని న్యాయవాద వృత్తి వదిలి రాజకీయాల్లోకి వచ్చానన్నారు.