పదహారు ఎంపీ సీట్లు సాధించాల్సిందే

 పదహారు ఎంపీ సీట్లు సాధించాల్సిందే

కేంద్రంలో చక్రం తిప్పాలంటే పదహారు ఎంపీ సీట్లు గెలవాల్సిందేనని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. లోక్‌సభ ఎన్నికలపై కేడర్‌కు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ కంచుకోట అయిన నల్లగొండ జిల్లాలో ప్రజలు టీఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టారని అన్నారు. అసెంబ్లీ ఫలితాలతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నైరాశ్యంలో ఉన్నాయని ఎద్దేవా చేశారు. కేంద్రంలో కీరోల్ గా ఉండి రాష్ట్రానికి జాతీయ హోదా ప్రాజెక్టు, బుల్లెట్ ట్రైన్లు తీసుకురావాల్సిన అవసరముందని అన్నారు. నల్లగొండ ఎంపీ స్థానంలో మూడు లక్షల మెజార్టీ అందించాలని పిలుపునిచ్చారు. నల్లగొండ పార్లమెంట్ పరిధిలోని నల్లగొండ, సూర్యాపేటలకు మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీదే అని అన్నారు. 

సాగర్ నుంచి రెండు పంటలకు నీళ్లు ,లిప్ట్ ఇరిగేషన్ ల పూర్తి మన ప్రభుత్వంలోనే జరిగిందని గుర్తు చేశారు. పెండింగ్‌లో ఉన్న ఎస్ఎస్ఎల్ బిసి పథకం,ఎస్సారెస్పీ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. 
పదహారు ఎంపీ సీట్ల విజయంలో నల్లగొండ ప్రజలు, పార్టీ కార్యకర్తలు పూర్తి సహకారం అందించాలని. నల్లగొండ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఎవరైనా భారీ మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అంతకుముందు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి 10వేల బైకులతో భారీ ర్యాలీగా కేటీఆర్‌కు ఘనస్వాగతం పలికారు. సభప్రాంగణంలో కేటీఆర్ పార్టీ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి కేటీఆర్ పూలమాల వేశారు. సర్వమత పెద్దలు కేటీఆర్‌ను ఆశీర్వదించారు.