ఒకేరోజు 29 కార్యాలయాలకు శంకుస్థాపన

ఒకేరోజు 29 కార్యాలయాలకు శంకుస్థాపన

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్) జిల్లాల వారీగా పార్టీ కార్యాలయాల నిర్మాణానికి పూనుకుంది. దీనిక కోసం ఇవాళ ఒకేరోజు 29  జిల్లాల్లో కార్యాలయ భవనాల శంకుస్థాపన నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య మంచి ముహూర్తం ఉన్నందున ఆ సమయంలోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని టీఆర్ఎస్ అధిష్ఠానం ఆదేశించింది. ఇక, ఈ కార్యక్రమంలో తొమ్మిది చోట్ల మంత్రులు, మిగతా జిల్లాల్లో జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్లు శంకుస్థాపనలు చేయనున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సిరిసిల్లలో జరిగే కార్యక్రమానికి హాజరుకానున్నారు. పార్టీకి ఇప్పటి వరకు ఖమ్మం, వనపర్తి జిల్లాల్లో ఆఫీసులున్నాయి. మొత్తం 33 జిల్లాల్లోనూ కార్యాలయాలుండాలని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ నిర్ణయించారు. 31 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు స్థలాల కోసం దరఖాస్తు చేసుకోగా.. ప్రభుత్వం రెండు దశల్లో భూములను కేటాయించింది. వరంగల్‌ గ్రామీణ జిల్లా, హైదరాబాద్‌లో స్థలాల ఎంపిక జరగలేదు. ఇక, ఖమ్మం, వనపర్తి మినహా మిగతా 29 జిల్లాల్లో ఇవాళ శంకుస్థాపనలు చేయనున్నారు. అన్ని జిల్లాల్లో ఒకే నమూనాలో కార్యాలయాల నిర్మాణం జరనుండగా.. పార్టీ అధిష్టానం ఒక్కో ఆఫీసు నిర్మాణ వ్యయం రూ.60 లక్షలుగా నిర్ణయించింది.