స్థానిక సమరంలోనూ విజయం మనదే

స్థానిక సమరంలోనూ విజయం మనదే

రాష్ట్రంలోని 32 జిల్లా పరిషత్తుల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. అలాగే 530కి పైగా మండల పరిషత్తుల్లోనూ గెలుస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఇతర పార్టీలకు భంగపాటు తప్పదని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజలు టీఆర్ఎస్ కే బ్రహ్మరథం పడతారని చెప్పారు. వారం, పది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉందని, పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలని సూచించారు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీలతో పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన సమావేశం ముగిసిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... 'అన్ని జిల్లాల జడ్పీ పీఠాలే లక్ష్యంగా పనిచేయాలి. పార్టీ శ్రేణులకు సోమవారం సీఎం కేసీఆర్ మార్గదర్శనం చేస్తారు. రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధిస్తాం. మొత్తం 32 జిల్లాలకు 32 జెడ్పీ చైర్మన్ పీఠాలను టీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయం.  ఇప్పటికే రాష్ట్రంలో జరిగిన వివిధ ఎన్నికల్లో అడ్రస్ గల్లంతైన కాంగ్రెస్ పార్టీతో సహా ఇతర ప్రతిపక్షాలకు రానున్న ఎన్నికల్లో నిరాశ తప్పదు. గత నెలరోజులుగా పార్లమెంట్ అభ్యర్థుల గెలుపు కోసం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించినం. ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకి మరోసారి బ్రహ్మరథం పట్టనున్నారు. వారం, పది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలి' అని కేటీఆర్ అన్నారు.