కేటీఆర్‌కు సీఎం పదవి..? ఆయన రియాక్షన్ ఏంటి..?

కేటీఆర్‌కు సీఎం పదవి..? ఆయన రియాక్షన్ ఏంటి..?

తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన కేసీఆర్... రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం అయ్యారు.. ఆ తర్వాత ముందుస్తు ఎన్నికలకు వెళ్లి ఘన విజయం సాధించి రెండోసారి సీఎం పీఠంపై కూర్చొన్నారు... అయితే, కేసీఆర్ తర్వాత నెక్స్ట్ సీఎం కేటీఆరేననే కామెంట్లు టీఆర్ఎస్‌లో గత కొంత కాలం నుంచి వినిపిస్తున్నాయి. మంత్రుల నుంచి మొదలుకొని... ఎమ్మెల్యేల దాకా పోటీపడి మరీ కేటీఆర్ సీఎం అంటూ సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు ఈ విషయం సందర్భం వచ్చినప్పుడల్లా ప్రస్తవిస్తూనే  వస్తున్నారు. నిజానికి...అటు పార్టీ ఇటు ప్రభుత్వం మీద పట్టు సాధిస్తూ వస్తున్నారు కేటీఆర్‌.

దీనిపై గతంలోనే కేసీఆర్ విస్పష్టమైన ప్రకటన చేశారు. ఏకంగా అసెంబ్లీ సమావేశాల్లోనే సీఎంగా తానే కొనసాగుతానని స్పష్టం చేశారు కేసీఆర్. తాను ఆరోగ్యంగా  ఉన్నానని... కేటీఆర్ ను ఎందుకు సీఎం చేస్తానని ప్రశ్నించారాయన. ఈ స్టేట్‌మెంట్‌తో అప్పట్లో కేటీఆర్ సీఎం అనే చర్చకు తాత్కలికంగా బ్రేక్ పడింది. ఇటీవల మళ్లీ కేటీఆర్ సీఎం అంశం తెరపైకి వచ్చింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మొదలుపెట్టిన కామెంట్లు ఇప్పుడు మంత్రులంతా ఎత్తుకున్నారు. చిన్నపిల్లవాడిని అడిగినా కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం అని చెబుతారని శ్రీనివాస్ గౌడ్ గతంలోనే చెప్పారు. ఈ మాటలకు కొనసాగింపుగానే ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా అదే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఆపైన మంత్రులు...ఎమ్మెల్యేలు ఇదే బాటలో నడుస్తున్నారు. మరోవైపు... మంత్రుల హడావుడి చూసిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలలో అలజడి మొదలైంది. ఈ విషయంలో తామెక్కడ వెనుకబడిపోతామోనని తదుపరి సీఎం కేటీఆరే నంటూ తమ తమస్థాయిలో ప్రకటనలు చేస్తున్నారు. ఇలాంటివి కేసీఆర్‌ దృష్టికి వెళ్లినా.. ఆయన నుంచి మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి  ప్రతిస్పందనా రాలేదు. దీంతో... అంతా కేటీఆర్‌కే జై కొడుతున్నారు. అయితే, కేటీఆరే నెక్ట్స్‌ సీఎం అంటూ... టీఆర్‌ఎస్‌లో జరుగుతున్న ప్రచారంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు వర్కింగ్ ప్రెసిడెంట్‌. ముఖ్యమంత్రి కావాలన్న అత్యాశ తనకు  లేదని చెప్పారు.