కేటీఆర్ సాయం.. ఎయిమ్స్‌కు కుశ్వంత్..!

కేటీఆర్ సాయం.. ఎయిమ్స్‌కు కుశ్వంత్..!

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో.. ఉన్నత చదువుల కోసం ఎయిమ్స్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నాడు కుశ్వంత్ అనే విద్యార్థి.. తెలంగాణ ఎంసెట్‌లో మొదటి ర్యాంక్, ఆంధ్రప్రదేశ్ ఎంసెట్‌లో 8వ ర్యాంక్, జాతీయ స్థాయి నీట్‌లో 50వ ర్యాంక్ సాధించిన కుశ్వంత్.. భూపాలపల్లి జిల్లావాసి. తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతచెందగా.. తల్లి కుట్టుమిషన్‌తో కుటుంబాన్ని లాక్కొస్తోంది. తండ్రిని కోల్పోయిన తర్వాత, తల్లి పడుతున్న కష్టాన్ని దగ్గరుండి చూసిన కుశ్వంత్, తన కుటుంబానికి అండగా ఉండాలని చదువుపై మక్కువ పెంచుకున్నాడు. ఏ పరీక్ష రాసినా అన్నింటా తన ప్రతిభను చాటాడు.. అయితే, రూ.5 లక్షలు కట్టలేని పరిస్థితుల్లో ప్రతిష్టాత్మక ఎయిమ్స్‌లో సీటు కోల్పేయే పరిస్థితి వచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న కేటీఆర్... వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 5 లక్షల సహాయాన్ని మంజురు చేయించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డికి ఫోన్ చేసి కుశ్వంత్‌ను శుక్రవారం హైదరాబాద్‌కు పిలిపించుకున్నారు. కుశ్వంత్ పట్టుదలకు, శ్రమను మెచ్చుకుని తాను చొరవ తీసుకుని మంజురు చేయించిన ఐదు లక్షల చెక్కును అతనికి అందజేశారు. మున్ముందు మరింతగా రాణించి ఉన్నత చదువులు చదువుకోవాలని కేటీఆర్ అభినందించారు. 

ఇక కుశ్వంత్ కథ ఇలా ఉంటే.. జాతీయస్థాయిలో నిర్వహించిన నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ పోటీ పరీక్షలో మొదటి ర్యాంక్ సాధించిన మేడ్చల్ జిల్లా గాజులరామారంకు చెందిన లావణ్య తండ్రి దినసరి కూలీ. తన కుటుంబ పేదరికం వల్ల ఫీజులు చెల్లించలేని పరిస్థితిని ట్విట్టర్ ద్వారా కేటీఆర్‌కు వివరించింది. అలాగే సిరిసిల్లకు చెందిన పవన్ కూడా నిరుపేద. తండ్రి టీ కొట్టుతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. పవన్ ప్రస్తుతం ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. లావణ్య, పవన్‌కు ఫీజులకు అవసరమైన మేరకు కేటీఆర్ తన సొంతంగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మొత్తానికి తెలంగాణ యువనేత విద్యార్థుల జీవితాల్లో వెలుగునింపారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే కేటీఆర్... సోషల్ మీడియాతో తన దృష్టికి వచ్చిన అనేక సమస్యలు వెంటనే పరిష్కారం చూపుతోన్న సంగతి తెలిసిందే.