వచ్చేనెల నుంచి పెంచిన 'ఆసరా' పెన్షన్‌లు

వచ్చేనెల నుంచి పెంచిన 'ఆసరా' పెన్షన్‌లు

పెంచిన ఆసరా పెన్షన్ల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచే పెంచిన పెన్షన్లు అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించినా.. లోక్‌‌సభ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. దీంతో పాత పెన్షన్లే పంపిణీ చేశారు. ఇక ఎన్నికల కోడ్ ముగియడంతో జూన్ నుంచి పెంచిన ఆసరా పెన్షన్ల పంపిణీకి సిద్ధమవుతోంది ప్రభుత్వం... అంటే పెంచిన పెన్షన్లు లబ్ధిదారులకు జులై నెలలో అందనున్నాయి. వికలాంగుల పెన్షన్‌ను రూ.1,500 నుంచి రూ.3,016కు, ఇతరులకు ఇచ్చే పెన్షన్ రూ. వెయ్యి నుంచి రూ.2,016కు పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే పెన్షన్లు అందుకునే వారి వయసును 65 నుంచి 57 ఏళ్లకు తగ్గించుతున్నట్లు తెలిపారు. మొదట ప్రకటించినట్టు ఏప్రిల్ 1 నుంచి పెంచిన పెన్షన్లను అందించాల్సి ఉన్నా... జనవరిలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికల కోడ్.. ఇక ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఎన్నికలతో కొన్నిజిల్లాల్లో కోడ్ కొనసాగింది. అనంతరం లోక్ సభఎన్నికల నోటి ఫికేషన్.. ఇలా వరుసగా ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో లబ్ధిదారుల ఎంపిక కూడా ఆలస్యమైంది. మొత్తం 9 రకాల వర్గాలకు ఆసరా పెన్షన్స్ అందనుండగా.. 46 లక్షల కుటుంబాలకు లబ్ధిచేకూరనుంది. సంవత్సరానికి రూ. 12 వేల కోట్లు ప్రభుత్వ ఖజానాపై భారం కానుంది. మొత్తానికి ఎన్నికల కోడ్ ముగియడంతో.. జులై నుంచి లబ్ధిదారులు కొత్త పెన్షన్లు అందుకోనున్నారు.