తెలంగాణలో ఇంటర్ ఫలితాలపై గందరగోళం

తెలంగాణలో ఇంటర్ ఫలితాలపై గందరగోళం

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ముగిసి నెల రోజులు పూర్తయ్యాయి. కానీ ఇప్పటి వరకు ఫలితాలు ఎప్పుడు అనే విషయంపై అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రుల్లో తీవ్రమైన ఆందోళన నెలకొంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒకేసారి ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఆంధ్రలో ఇప్పటికే ఫలితాలు ప్రకటించేశారు. తెలంగాణలో ఇంటర్ ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. నిజానికి తెలంగాణలో ఇంటర్ పేపర్ వాల్యుయేషన్ ఏప్రిల్ 2నే ముగిసింది.కానీ ఫలితాలు ఎప్పుడు ప్రకటించేదీ ఇంటర్ బోర్డు స్పష్టత ఇవ్వడం లేదు. ఎవరైనా అడిగినా జవాబు చెప్పే పరిస్థితిలో అధికారులు లేరు. అందుకని ఇంటర్ బోర్డులో ఫలితాలకు జవాబుదారీ అయిన ఉన్నతాధికారులంతా తప్పించుకు తిరుగుతున్నారు. సాంకేతిక కారణాలతోనే ఫలితాలు ఆలస్యం అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంటర్ ఫలితాల ప్రకటనలో జాప్యంపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు చక్కర్ల కొడుతున్నాయి. వీటిని ఖండించడం కానీ, వివరణ ఇచ్చేందుకు కానీ ఎలాంటి సమాధానం లేకపోవడంతో అధికారులు మొహం చాటేస్తున్నారని టాక్ వస్తుంది. ఏదేమైనా బోర్డు అధికారులు తమ నిర్లక్ష్యం కారణంగా లక్షలాది ఇంటర్ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు.