పోలీస్ అకాడమీలు డంపింగ్ యార్డ్ లు !

పోలీస్ అకాడమీలు డంపింగ్ యార్డ్ లు !


పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకె సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీస్ అకాడమీలు డంపింగ్ యార్డ్ లా మారాయని వ్యాఖ్యానించారు. పోలీస్ అకాడమీల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని,  అకాడమీ కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చు వృథా అని ఘాటు విమర్శలు చేశారు. సామాజిక కార్యకర్తల్లా ఉండాల్సిన పోలీసులు బాధితుల పట్ల ఏమాత్రం సానుభూతి చూపడం లేదని, ధనిక, పలుకుబడిన వర్గాలకు కొమ్ముకాస్తున్నాయని మండిపడ్డారు.

జైళ్లలో ఉన్నవాళ్లలో 90శాతం బీదవారేనని, కొంతమందికి ఏ కేసులో జైలుకు వచ్చామన్నది కూడా తెలియదని సానుభూతి వ్యక్తంచేశారు. పోలీసు అకాడమీలో ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ట్రైనింగ్ సెంటర్‌లలో శిక్షణ తీసుకుని బయటకు వెళ్తున్న అధికారులు మంచి పేరు తీసుకొని రాలేకపోతున్నారని వీకే సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పోలీసులు ప్రజల కోసం ప్రాణాలు కోల్పోతున్నారు.

కానీ ఎక్కడా ప్రజల నుంచి తగిన గుర్తింపు రావడం లేదని అన్నారు. దానికి కారణం శిక్షణా లోపమేనని వీకే సింగ్ తెలిపారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలన్నారు. బ్రిటిష్ పాలకుల నుంచి వచ్చిన ఆచారం ఇంకా పోలీస్ శాఖలో కొనసాగుతుందన్నారు. అవినీతిలో తెలంగాణ రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో ఉందన్న ఓ సర్వే తనను తీవ్రంగా బాధించిందని వీకే సింగ్ తెలిపారు. వ్యవస్థను మార్చలేను కానీ, శిక్షణలో మార్పులు తీసుకొస్తానని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

వీకే సింగ్ కొంత కాలం క్రితం వరకు ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ డీజీగా ఉన్నారు. ఇటీవలే పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌గా నియమించారు. ప్రిటింగ్‌ అండ్‌ స్టేషనరీ డీజీగా ఉన్న సమయంలోనూ వీకే సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ విభాగం నష్టాల్లో ఉందని ఆ శాఖను మూసేయాలని ప్రభుత్వానికి లేఖ రాస్తానని సంచలనం రేపారు.