తొలిసారి మా కులానికి దక్కిన గౌరవం

తొలిసారి మా కులానికి దక్కిన గౌరవం

యాంకర్:  పుట్టా సుధాకర్ యాదవ్ టీటీడీ చైర్మన్ పదవి చేపట్టిన తర్వాత.. చేపట్టక ముందు కొన్ని విమర్శలు ఎదుర్కున్నారు. ఇలాంటివి అసలు ఆరోపణలే కాదంటారా? లేకా ఈ విమర్శలతో బాధపడుతున్నారా? అనేది ఆయనను ఫేస్ టు ఫేస్ ద్వారా అడిగి తెలుసుకుందాం.
యాంకర్ : తిరుపతి అంటే ఓ ఆధ్యాత్మిక స్వర్గదామం. అక్కడి శ్రీవారి దర్శనం అయితే చాలు అని కోట్ల మంది భక్తులు నిరంతరం తపిస్తుంటారు. అలాంటి ఓ గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రానికి చైర్మన్ అయ్యారు. మీరు ఎలా భావిస్తున్నారు? 
పుట్టా సుధాకర్ యాదవ్ : ఓం నమో వేంకటేశాయ. శ్రీవారి ఆశీస్సులతో.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారి దీవెనలతో నాకు ఈ అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది.. అందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నా. 
యాంకర్ : టీటీడీ చైర్మన్ పదవి రావడం అంటే ఆ స్వామివారి కృప.. అదృష్టం ఒక ఎత్తు అయితే.. ముఖ్యంగా మీకు ధనం.. యనమలగారి బంధుత్వం మరో కారణమంటున్నారు. అది నిజమేనా? 
పుట్టా సుధాకర్ యాదవ్ : అది అంతా అబద్ధం.. అవాస్తవం. అదే కరెక్టైతే ఎంతమందికి ధనం లేదు.. ఎంతమందికి బంధుమిత్రుల  తోడులేదు. అలాగే.. ఈ ఎంపిక యనమలగానీ.. తలసాని శ్రీనివాస యాదవ్ సహకారం గానీ ఏం లేదు. 
యాంకర్ : మీరు మాట్లాడుతున్న ప్రతిసారి కూడా యాదవ కులానికి అవకాశం ఇచ్చారని చెప్తున్నారు. హిందూ ధర్మానికి ప్రతీకగా ఉన్న టీటీడీలో కులాన్ని చొప్పించి మాట్లాడటం ఎంతవరకు సబబు అని భావిస్తున్నారు? 
పుట్టా సుధాకర్ యాదవ్ : కులం కాదు.. వేంకటేశ్వరస్వామి మాకు చంద్రబాబు రూపంలో వచ్చి ఇచ్చిన పదవి ఇది. అంతే కానీ ఇందులో ఎలాంటిది లేదు. 
యాంకర్ : ఇదివరకు ఈ పదవి దక్కించుకున్న వాళ్లు ఎవరూ కూడా ఇలాంటి కులాలని ఆపాదిస్తూ... ఎక్సైట్ గా ఫీల్ కాలేదు.. అలాంటిది మీరు ఎందుకు అలా మాటిమాటికి యాదవ్ లకు దక్కిన అవకాశం అని చెప్పుకున్నారు.? 
పుట్టా సుధాకర్ యాదవ్ : ఇదివరకు వచ్చిన వాళ్లు ఒక ఎత్తు. మాకు ఒక ఎత్తు. మాకు మొదటి సారిగా దక్కిన అవకాశం. కాబట్టే ఇలా ఎక్కువ ఫీల్ కావాల్సి వచ్చింది. మమ్మల్ని గౌరవించిన సంతోషంతో అమితంగా ఫీల్ కావాల్సి వచ్చింది.
యాంకర్ : మిమ్మల్ని చూడబోతే ఆ స్వామివారికి పరమభక్తుల వలె కనిపిస్తున్నారు. ఆరు నెలల క్రితం మీకు పదవి వస్తుందని టాక్ రాగానే పలు రకాల ఆరోపణలు వచ్చాయి. మీరు.. ముఖ్యంగా క్రిష్టియన్ సంస్ధలను ప్రోత్సహించారని... ఆయా సంస్థలకు విరాళాలు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. ఎందుకు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది?
పుట్టా సుధాకర్ యాదవ్ : ఆరోపణలు కావవి.. అది పెద్ద కుట్ర. వాళ్లు క్రిస్టియన్సే అయ్యుండ వచ్చుగానీ.. వారు జాత్ర అని పెద్ద పండుగ చేసుకుంటారు. అది ఎద్దుల పందెం. అప్పుడు నేను నియోజక వర్గం ఇంచార్జిగా ఉన్నా కాబట్టి గెస్ట్ గా రమ్మన్నారు వెళ్లాను.  అక్కడకు వచ్చిన జనాలు కూడా 95శాతం హిందువులే ఉన్నారు. బీసీలు.. బడుగు బలహీన వర్గాలను రానీయకుండా.. అగ్రకులాలవారు చేసిన కుట్రలో భాగమే ఆ రాద్ధాంతం అంతా. ఇక కరుణాకర్ రెడ్డి నాస్తికుడు.. అతడిని ఎవరైనా ప్రశ్నించారా? రాజశేఖర్ రెడ్డి ఏడుకొండలను రెండు కొండలు చేయాలన్నప్పుడు ఎవరైనా మాట్లాడారా? అన్నారు.
యాంకర్ : మీరు ధర్మ కర్తల మండలిలో సభ్యుడిగా ఉండగానే క్రిస్టియన్స్ కు విరాళాలు, చర్చిలకు ప్రోత్సాహకాలు ఇచ్చారని శివస్వామి ఆరోపణ. అందుకు మీరేమంటారు? 
పుట్టా సుధాకర్ యాదవ్ : అలాంటిది నేనెప్పుడు చేయలేదు. ఇంకా నా సొంత నిధుల నుండి హిందూ దేవాలయాలకు 2 కోట్లు ఖర్చుపెట్టి అభివృద్ధి చేశాను. 
యాంకర్ : ఇప్పుడు చైర్మన్ అయ్యాక ఆ తిరుణాళ్లకు వెళ్లడం, చర్చిలకు విరాళాలు ఇవ్వడం కరెక్టే అని భావిస్తున్నారా?
పుట్టా సుధాకర్ యాదవ్ : తిరునాలకు వెళ్లడం పద్ధతే.. కరెక్టే అని భావిస్తున్నాను. ఎందుకంటే.. కార్యకర్తలు అంతా చాలా మంది కలిసి అతిథిగా పిల్చారు. అప్పుడు వెళ్లడం కరెక్ట్ కాకపోవడం ఎలా అవుతుంది. అది ముమ్మాటికీ కరెక్టే.. అది అగ్రికులాల వారు పన్నిల కుట్రలో భాగం అంతే... 
యాంకర్: మీరు కాకపోతే మరొకరు అవుతారు. అది కుట్ర ఎలా అవుతుంది.? 
పుట్టా సుధాకర్ యాదవ్ : అంటే ఎవరైనా కావచ్చు. మేము కాకూడదని వారి భావన అంతే.. 
యాంకర్: మీరు హిందువుకాదని... క్రిస్టియన్ సంస్థలను ప్రోత్సహించారని.. అంతా దాడి చేస్తుంటే.. మీరు మాత్రం కులాన్ని అడ్డుపెట్టుకొని ఇది కులంపై దాడిగా చెప్తూ.. కులాన్ని అడ్డుపెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్.? 
 పుట్టా సుధాకర్ యాదవ్ : అందులో నిజం లేదు. నా మీదే వారు ఎందుకు అటాక్ చేస్తారంటే... బీసీలం.. బడుగు బలహీన వర్గాలం కాబట్టి. గతంలో అగ్రకులాల వారిపై వారంతా దాడి చేయలేకపోయారేం.. ఎందుకని వారిని అడగలేదు. 
యాంకర్ : ఓకే ఇప్పుడు మీ పాలక మండలి కూడా తిరుపతి దర్శనం అంటే పరపతి ఉన్నవారికే తిరుపతి వలెనే ఉంటుందా.. లేకా సామాన్యునికి పెద్ద పీఠ వేస్తుందా? 
పుట్టా సుధాకర్ యాదవ్ : సామాన్యులకు పెద్ద పీఠ వేయడమే మా ధర్మం. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడటం మా విధి. భక్తులే దేవుళ్లు. వారికి సేవ చేయడం ఆ దేవుడికి సేవ చేయడం లాంటిదే. 
యాంకర్ : వీఐపీలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారన్నది నిజం కాదా?  అందులో మార్పులు తీసుకువస్తారా? 
పుట్టా సుధాకర్ యాదవ్ : అదేం లేదు ప్రోటోకాల్ ఫాలో అవుతాం అంతే... 
యాంకర్ : పాలకమండలి అంటేనే సిఫార్సుల కోసమే.. రికమెండేషన్స్ కోసమే అని టాక్... వాళ్లు తిరుపతికి చేసేదేం లేదంటారు.. దాన్ని మీరు మారుస్తారా? 
పుట్టా సుధాకర్ యాదవ్ : అదంతా అబద్ధం.. బయట అవన్నీ మాట్లాడుకుంటుంటారు గానీ.. అందులో వాస్తవం లేదు. నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సామాన్యులతో సర్వదర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. ఆ సమయంలో వారి ఇబ్బందులను అడిగి తెలుసుకుంటూ వారితో కలిసి దర్శనం చేసుకున్నాను. సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా చేస్తాం. 
యాంకర్ : సామాన్య భక్తులకు మీరు చేసే సౌకర్యోపాయం ఏంటి?  
పుట్టా సుధాకర్ యాదవ్ : ఆగమశాస్త్రానికి అనుగుణంగా భక్తుల అందరికీ సౌకర్యాలను మెరుగుపరుస్తూ.. సంతృప్తికరమైన దర్శనం చేయించగలగడం తప్పకుండా చేస్తాం. 
యాంకర్ : ఈ మధ్య అధికారులు ఓ ప్రయాగం చేశారు. గర్భగుడి వద్ద మెట్లు కట్టి త్వరగా వెలుపలికి పంపాలని... దానికి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. మీరు అలాంటి వాటికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? 
పుట్టా సుధాకర్ యాదవ్ : ఇక్కడున్న ధర్మ కర్త పాలక మండలిలో అంటే భక్తులకు దేవుడికి అనుసంధానమైనది ఇది. ఇది సక్రమంగా జరిపించేలా మేం ఉండాలి. 
యాంకర్ : టీటీడీ ఉద్యోగులు తోలు మందమైందని... వాళ్లు భక్తులను పట్టించుకొనే పరిస్థితులలో లేరని అపవాదు ఉంది. మరి అంతమంది మీరు సరైన మార్గంలోకి తీసుకురాగలరా? 
పుట్టా సుధాకర్ యాదవ్ : ఖచ్చితంగా దారిలోకి తెస్తాను. మారుస్తాను. 
యాంకర్ : ముఖ్యంగా ఇక్కడ పూజారులు అధికారుల మీద ఓ నెపం వేస్తున్నారు. వీఐపీల కోసం స్వామివారికి చేసే కైంకర్యాలు తగ్గించండని... వీఐపీలకే ఎక్కువ సేవ చేయండి అని ఉంది. వాటిని మీరు ఎలా అధిగమిస్తారు.? 
పుట్టా సుధాకర్ యాదవ్ : వారిద్దరినీ గాడిలో పెడతాను.  అలాంటి వాటికి చెక్ పెట్టి స్వామి వారి పూజలను ఎటువంటి అంతరాయం కలగకుండా సంపూర్ణంగా చక్కగా జరిగేట్టు చేస్తాం. భక్తులకు పెద్ద పీఠ వేస్తాం. 
యాంకర్ : లడ్డు ధర పెంచడంలో అర్థం  ఉంది. అన్నీ వస్తువులు పెరిగాయి కాబట్టి.. కానీ దర్శనానికి టిక్కెట్ ధర పెంచడం ఏంటి? 
పుట్టా సుధాకర్ యాదవ్ :  అంటే దేవుడి సుప్రభాత సేవకు ఏకాంత సేవకు 250-300 చేస్తే దేవుడిని ఎక్కువగా.. దగ్గరగా చూసుకొనేందుకు అలా పెట్టాం. 
యాంకర్ : ఈ మధ్య పాలక మండలి లేని సమయంలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయలను ప్రైవేటు బ్యాంకుల్లో అధికారులు డిపాజిట్ చేశారు.  ఈ బోర్డు దానికి పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. దాన్ని మీరు సమర్థిస్తారా? 
పుట్టా సుధాకర్ యాదవ్ : ఇంకా ఆ విషయం మా నోటీసుకు రాలేదు. అది వచ్చినప్పుడు మేమంతా కూర్చొని ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది చర్చిస్తాం. 
యాంకర్ : ముఖ్యంగా మీరు యాదవ పక్షపాతి అనే ముద్ర వేయించుకున్నారు ఎందుకు. మీ నియోజక వర్గంలో అధికారులను కూడా అందరినీ వారినే వేయించుకున్నారంట? 
పుట్టా సుధాకర్ యాదవ్ : అదేం లేదు.. అది అంతా అబద్ధపు ప్రచారం మాత్రం. ముఖ్యంగా నియోజక వర్గంలో ఎంఆర్వోలు, ఎండీవోలు ఎవరూ మా నియోజక వర్గంలో ఒక్క యాదవ్ లేడు. ఎందుకు ఊరక అబద్ధాలు ప్రచారం చేస్తారు. 
ఇంకా టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఏం మాట్లాడారో తెలుసుకోవాలంటే క్రింది వీడియోను క్లిక్ చేయండి.