బ్రూనై సుల్తాన్ హోటళ్లు బాయ్ కాట్ చేయండి

బ్రూనై సుల్తాన్ హోటళ్లు బాయ్ కాట్ చేయండి

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది అభిమానులు ఉన్న అమెరికా టీవీ వ్యాఖ్యాత ఎల్లెన్ డిజెనెరెస్ కి బ్రూనై సుల్తాన్ పై కోపం వచ్చింది. ది ఎల్లెన్ షో నిర్వహించే ఎల్లెన్, బ్రూనై సుల్తాన్ హసనల్ బోల్కియాకి చెందిన అన్ని హోటళ్లను బాయ్ కాట్ చేయాలని పిలుపు నిచ్చింది. డోర్చెస్టర్ కలెక్షన్ గా పేరున్న బ్రూనై సుల్తాన్ ఆస్తులను బహిష్కరించాలని ఎల్లెన్ కోరింది.

లెస్బియన్ కమెడియన్ అయిన ఎల్లెన్ బహిష్కరించాల్సిన బ్రూనై సుల్తాన్ కి చెందిన ఈ హోటళ్ల జాబితాను ట్వీట్ చేసింది. వీటిలో బెవర్లీ హిల్స్ హోటల్, హోటల్ బెల్-ఎయిర్ కూడా ఉన్నాయి. తనను ట్విట్టర్ లో ఫాలో అయ్యేవారందరూ బ్రూనైకి సుల్తాన్ కి వ్యతిరేకంగా నిలబడి ఈ సందేశాన్ని వ్యాప్తి చేయాలని కోరింది.

ఆగ్నేయాసియాలోని బ్రూనై ఇకపై దేశంలో షరియా చట్టాలు అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా స్వలింగ సంపర్కులను, వ్యభిచారులను రాళ్లతో కొట్టి చంపేందుకు అనుమతిస్తూ చట్టం చేసింది. ఈ చట్టం బుధవారం నుంచి అమలులోకి వస్తుంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎల్లెన్ 'రేపటి నుంచి బ్రూనై స్వలింగ సంపర్కులను రాళ్లతో కొట్టి చంపనుంది. ఇప్పుడే మనం దీనికి వ్యతిరేకంగా ఏదైనా చేయాలి. దయచేసి బ్రూనై సుల్తాన్ కి చెందిన ఈ హోటళ్లను బహిష్కరించండి. మీ గొంతు వినిపించండి. ఈ మాట వ్యాప్తి చేయండి. నిలబడండి' అని కోరింది.

2014లో బ్రూనై ఇలాంటి చట్టాలను ప్రవేశపెడుతోందని తెలియగానే డిజెనెరస్ ఈ ఆస్తులను బహిష్కరించాలని పిలుపునిచ్చింది. పాప్ గాయకుడు ఎల్టన్ జాన్, హాలీవుడ్ నటుడు జార్జ్ క్లూనీ, క్వీర్ ఐ బ్యాండ్ కి చెందిన బాబీ బెర్క్, జొనాథన్ వాన్ నెస్ కూడా బ్రూనై సుల్తాన్ ఆస్తుల బహిష్కరణకు పిలుపునిచ్చారు.