'రాంప్రసాద్‌ను చంపింది నేనే..'

'రాంప్రసాద్‌ను చంపింది నేనే..'

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసులో రోజుకో ట్విస్ట్‌ బయటపడుతోంది. హత్య చేయించింది కోగంటి సత్యం అని రాంప్రసాద్ కుటుంబసభ్యులు ఆరోపిస్తుండగా... వాటిని ఖండిస్తూ శ్యామ్‌ అనే వ్యక్తి తెరమీదకి వచ్చాడు. రాంప్రసాద్‌ను తానే హత్య చేశానని 'ఎన్టీవీ'కి చెప్పాడు. తన దగ్గర పనిచేసే చోటూ, రమేష్‌ల సహాయంతో రాంప్రసాద్‌ను చంపేసానని తెలిపాడు. 

ఊరా శ్రీనివాస్‌ అనే వ్యక్తి తన మీద, కోగంటి సత్యం మీద అక్రమంగా కేసులు పెట్టించాడని, ఆ క్రమంలో పోలీసులు తన ఇంటికి వచ్చి రూ. 15 లక్షలు తీసుకెళ్లిపోయారని అన్నాడు. తన బావ రాంప్రసాద్‌ చెబితేనే కేసులు పెట్టానని ఊరా శ్రీనివాస్‌ చెప్పాడని తెలిపాడు. రాంప్రసాద్ వల్ల తాను కూడా నష్టపోయానని ఊరా శ్రీనివాస్ చెప్పాడని.. అందుకే ఆయణ్ను హత్య చేయమని కోరాడని శ్యామ్‌ వివరించాడు. రాంప్రసాద్‌ను చంపితే 30 లక్షలు సర్ధుబాటు చేస్తానని ఊరా శ్రీనివాస్‌ చెప్పడంతో హత్యకు ప్లాన్‌ చేశానని చెప్పాడు.

పదిహేను రోజులు రెక్కీ నిర్వహించి హత్య చేశామని, ఆ తర్వాత ఎల్బీనగర్ మీదుగా విజయవాడకు పారిపోయానని చెప్పాడు. హత్యకు ఉపయోగించిన మూడు కత్తులను తన వాటర్ ప్లాంట్లోనే తయారు చేయించానని అన్నాడు. ఈ హత్యతో కోగంటి సత్యంకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసిన శ్యామ్‌.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో లొంగిపోతానని అన్నాడు.