ట్విట్టర్ సీఈవోకి పార్లమెంట్ ప్యానెల్ వార్నింగ్

ట్విట్టర్ సీఈవోకి పార్లమెంట్ ప్యానెల్ వార్నింగ్

ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ, ఇతర ఉన్నతాధికారులకు పార్లమెంట్ ప్యానెల్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. రాబోయే 15 రోజుల్లో తమ ఎదుట హాజరు కావాల్సిందేనని సోమవారం స్పష్టం చేసింది. తగినంత వ్యవధి లేనందువల్ల ఐటీ వ్యవహారాలపై పార్లమెంటరీ కమిటీతో సమావేశానికి హాజరు కాలేకపోయామన్న ట్విట్టర్ అధికారుల వివరణపై పార్లమెంట్ ప్యానెల్ ఘాటుగా స్పందించింది. ట్విట్టర్ సీనియర్ అధికారులు లేదా సీఈవో జాక్ డోర్సీ తమ ఎదుట హాజరయ్యేవరకు ఆ సంస్థకు చెందిన ఏ అధికారులతో భేటీ అయ్యేది లేదని పార్లమెంటరీ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. తమ ఎదుట హాజరయ్యేందుకు ట్విట్టర్ కి కమిటీ 15 రోజుల వ్యవధిని ఇచ్చింది. మిగతా సోషల్ మీడియా వేదికలకు కూడా త్వరలోనే పార్లమెంటరీ కమిటీ తాఖీదులు పంపనున్నట్టు తెలిసింది.

పార్లమెంటరీ కమిటీ ఎదుట హాజరయ్యేందుకు చాలా తక్కువ వ్యవధి ఇచ్చినందువల్ల హాజరు కాలేమని ట్విట్టర్ ఇంతకు ముందు తెలియజేసింది. ఫిబ్రవరి 1న రాసిన లేఖలో ట్విట్టర్ ను హాజరు కావాల్సిందిగా కమిటీ కోరింది. 2019 లోక్ సభ ఎన్నికలు రానుండటంతో పౌరుల డేటా ప్రైవసీ, ఎన్నికల్లో సోషల్ మీడియా పాత్రపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ అంశాలన్నిటినీ ప్రస్తావిస్తూ కమిటీ ట్విట్టర్ కి లేఖ రాసింది. 'సంస్థ అధిపతి కమిటీ ముందు హాజరు కావాలి. వారితో పాటుగా మరో ప్రతినిధి కూడా రావచ్చని' లేఖలో తెలిపారు. 

దీనికి సమాధానంగా ట్విట్టర్ గ్లోబల్ లీడ్ లీగల్, పాలసీ, ట్రస్ట్ &సేఫ్టీ విజయ్ గద్దె జవాబిస్తూ 'భారత్ కి సంబంధించిన కంటెంట్, ఖాతాల విషయంలో మా నియమాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలను  ట్విట్టర్ ఇండియా తరఫున ఎవరూ అమలు చేయలేరని' పేర్కొన్నారు. తక్కువ వ్యవధిని కారణంగా చూపుతూ పార్లమెంటరీ ప్యానెల్ ఎదుట హాజరయ్యేందుకు ట్విట్టర్ నిరాకరించడంతో దీని పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బీజేపీ హెచ్చరించింది. దేశంలోని వ్యవస్థలను అగౌరవపరిచే హక్కు ఏ సంస్థకు లేదని చెప్పింది.