ట్విట్టర్ లో ఆర్సీబీపై పేలుతున్న సెటైర్లు

ట్విట్టర్ లో ఆర్సీబీపై పేలుతున్న సెటైర్లు

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో వరుసగా ఆరు మ్యాచ్ లు ఓడిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తిరిగి టోర్నమెంట్ లో కొనసాగేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి మెల్లగా పైకి ఎగబాకుతూ ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవుతుందనే ఆశలు కల్పించింది. కానీ చివరకు మంగళవారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమితో టోర్నీ నుంచి ఔటైపోయింది. 

బెంగుళూరు లో జరిగిన కీలక మ్యాచ్ లో ఎడతెరిపి లేని వర్షం హోమ్ టీమ్ కొంప ముంచింది. మొదట ఐదు ఓవర్లకు తగ్గించిన మ్యాచ్ చివరకు రద్దు కావడంతో ఆర్సీబీ మరో ఐపీఎల్ సీజన్ నిరాశగా ముగించాల్సి వచ్చింది. దాదాపు అర్థరాత్రి సమయం వరకు వాయిదా పడిన మ్యాచ్ లో చివరకు కవర్లను తొలగించి టీ20 మ్యాచ్ ను కాస్తా 5 ఓవర్లకు మార్చారు. మొదట బ్యాటింగ్ దిగిన రాయల్ చాలెంజర్స్ కి కోహ్లీ అద్భుత ఆరంభాన్ని ఇచ్చాడు. కానీ ఆర్సీబీ ఐదు ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేయగలిగింది.

జవాబుగా రాజస్థాన్ రాయల్స్ 3.2 ఓవర్లలో వికెట్ కోల్పోయి 41 పరుగులు చేసింది. 10 బంతుల్లో 22 పరుగులు కావాల్సి ఉండగా కుంభవృష్టి కురవడంతో మ్యాచ్ రద్దు చేసి రెండు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. ఇప్పటివరకు ప్రతిసారీ ఓడిపోగానే ఇంటర్నెట్ లో వెటకారాలు మామూలైపోయిన ఆర్సీబీపై ఐపీఎల్ ఫ్యాన్స్ మరిన్ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.