పాక్ రేంజర్ల దాడిలో ఇద్దరు జవాన్లు మృతి

పాక్ రేంజర్ల దాడిలో ఇద్దరు జవాన్లు మృతి

జమ్మూకశ్మీర్‌ పరగ్వాల్‌ సెక్టార్‌లోని అక్నూర్‌లో జమాన్‌ బెళా పోస్టుపై పాకిస్తాన్‌ రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారతీయ జవాన్లు మృతి చెందారు. ఈరోజు తెల్లవారు జామున పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాకిస్తాన్ రేంజర్లు జరిపిన ఈ దాడిలో బీఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ వీకే పాండే (27), ఏఎస్‌ఐ ఎస్‌ఎన్‌ యాదవ్‌ (48) తో పాటు ముగ్గురు పౌరులు గాయ పడ్డారని వారిలో ఒక యువతి ఉన్నట్లు పరగ్వాల్‌ చెక్‌ పోస్ట్‌ ఇన్‌చార్జ్‌ బ్రిజిలాల్‌ శర్మ వెల్లడించారు. ఆ వెంటనే అప్రమత్తమైన భారత జవాన్లు దాడులు ప్రారంభించాయని.. సరిహద్దుల్లో కాల్పులు  కొనసాగుతున్నట్లు ఆయన వివరించారు. 

సరిహద్దుల్లో అభద్రతా భావంతో బతుకుతోన్న ప్రజల విషయంలో కచ్ఛితమైన నిర్ణయం తీసుకుందామని పాకిస్తాన్‌ మిలటరీ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌.. మే 29న భారత్‌కు పిలుపునిచ్చింది. పాకిస్తాన్‌  అభిప్రాయానికి భారత్‌ సానుకూలంగా స్పందించింది. సరిహద్దుల్లో శాంతి కోసం చర్చలకు సిద్ధమని కూడా బారత్ తెలిపింది. ఎన్నిసార్లు ఇలాంటి ప్రకటనలు చేసుకున్నా పాకిస్తాన్ మాత్రం మాటిమాటికి దొంగదెబ్బ తీస్తూనే ఉంది.