శామీర్‌ పేటలో ఘోర రోడ్డుప్రమాదం...కారు మీద కారెక్కి !

శామీర్‌ పేటలో ఘోర రోడ్డుప్రమాదం...కారు మీద కారెక్కి !

మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట పరిధిలోని జాతీయ రహదారి మీద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టి ఎదురుగా వస్తున్న మరో కారుపైకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం నలుగురు వ్యక్తులు సిద్దిపేట్ నుంచి కారులో హైదరాబాద్‌ వస్తున్నారు. శామీర్‌పేట తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు అదుపు తప్పి కారు డివైడర్‌ను ఢీకొట్టింది. అయితే డివైడర్ చిన్నగా ఉండడంతో పాటు కారు స్పీడ్ మీద ఉండడంతో పల్టీలు కొడుతూ ఎదురుగా హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ వైపు వెళ్తున్న మరో కారు మీద పడింది. ఈ ప్రమాదంలో పల్టీలు కొట్టిన కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఓ మహిళ, ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. కింద ఉన్న కారు డ్రైవర్‌ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను 108 వాహనంలో గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మూడేళ్ల కిందట పంజాగుట్ట ఫ్లై ఓవర్ వద్ద జరిగిన రమ్య యాక్సిడెంట్ ను గుర్తుచేస్తోంది.