"నీ రీప్లేస్ మెంట్" సర్జరీల్లో 80శాతం ఫెయిల్

"నీ రీప్లేస్ మెంట్" సర్జరీల్లో 80శాతం ఫెయిల్

Image: Indian Express

హెల్త్ టెక్నాలజీ అభివృద్ధి చెందినా, వైద్య నిపుణుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా.. నిరుపేద పేషెంట్ల కష్టాలు మాత్రం తీరడం లేదు. ఢిల్లీలోని ప్రఖ్యాత ఎయిమ్స్, ఆర్థోపెడిక్ విభాగానికి వెళ్లి చూసినట్లయితే నీ రీప్లెస్ మెంట్, హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీలు ఎంత దారుణంగా ఉంటున్నాయో అర్థమవుతుంది. అక్కడికి వచ్చే పేషెంట్లు తొలిసారి నీ రీప్లేస్ మెంట్ కోసం కాక.. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి రీప్లేస్ మెంట్ సర్జరీ ట్రీట్ మెంట్ కోసం వస్తున్నవారిని గమనించవచ్చు. ఒకే ప్రాబ్లమ్ కు ఇన్నిసార్లు సర్జరీ చేస్తే ఎలా ఉంటుందన్న ప్రశ్నను కాసేపు పక్కన పెడితే.. చివరి నిమిషంలో ఆదుకునే వైద్య నారాయణుడిగా ఆ విభాగం ఇంచార్జ్ డాక్టర్ సీఎస్ యాదవ్ సేవలకే ఆ క్రెడిట్ దక్కుతుంది. ఆయన సోమవారం పేషెంట్లను పరీక్షించి, వారికి నెంబర్ ఇచ్చి మరుసటి రోజు ఆపరేషన్ చేస్తారు. ఇలా వారమంతా ఒకరోజు పేషెంట్ల పరీక్షలు, మరుసటి రోజు సర్జరీలు. ఇదే ఆయన డ్యూటీ. 

భారతదేశంలో ఏటా లక్షా 20 వేల నీ రీప్లేస్ మెంట్ సర్జరీలు, 70 వేల హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీలు జరుగుతున్నాయి. అదే ఎయిమ్స్ లో ఏటా 1500 కు పైగా నీ, హిప్ రీప్లెస్ మెంట్ సర్జరీలు జరుగుతున్నాయి. అందులో 20 శాతం రివిజన్ సర్జరీలేనని యాదవ్ చెబుతారు. అంటే 20 శాతం కేసులు ఫెయిలవుతున్నాయి. వాటిలో రెండోసారి, మూడోసారి, నాలుగోసారి కూడా ఫెయిలైన కేసులు కూడా చాలానే ఉంటాయని ఆయనంటారు. ఒకసారి నీ ఇంప్లాంట్ చేశాక కనీసం 10 ఏళ్లు అది పని చేస్తుంది. కానీ సర్జికల్ ఎర్రర్స్ కారణంగా 80 శాతం సర్జరీలు నెలల్లోనే ఫెయిలవుతున్నాయి. ఈ 80 శాతంలో చాలావరకు హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీలేనట. 

దేశంలోని చిన్న పట్టణాల నుంచి, రవాణా సౌకర్యాలు పెద్దగా లేని పట్టణాల నుంచి ఇలాంటి పేషెంట్లు ఎక్కువగా ఎయిమ్స్ కు వస్తున్నారు. చిన్న పట్టణాల్లో సరైన వసతులు లేకపోవడం, అనుభవజ్ఞులైన డాక్టర్లు అందుబాటోలు లేకపోవడం, మార్కెట్ శక్తుల మాయాజాలం, నాసిరకమైన డివైసెస్, ఆపరేషన్ థియేటర్లలో సరైన ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వంటి అనేక కారణాలతో.. పేషెంట్లు తన జీవితకాలాన్ని కోల్పోతున్నారు. శేష జీవితాన్ని మంచానికే పరిమితమై ఆనందరహితంగా గడపాల్సి వస్తోంది. 

ఇంప్లాంట్ చేసినప్పుడు సరైన డివైస్ అమర్చకపోవడం, అమర్చగలిగిన నిపుణుడైన డాక్టర్ అందుబాటులో ఉన్నా డివైస్ లు లేకపోవడం.. ఆపరేషన్ యాజమాన్యాల ధనదాహం వంటివి ఇలాంటి సమస్యలకు కారణాలవుతున్నాయి.