హీరోయిన్‌ రష్మిక ఫొటోకు కలెక్టర్ కామెంట్..? ఇద్దరిపై వేటు...

హీరోయిన్‌ రష్మిక ఫొటోకు కలెక్టర్ కామెంట్..? ఇద్దరిపై వేటు...

జగిత్యాల జిల్లా కలెక్టర్ గుగులోతు రవి అనుకోని వివాదంలో చిక్కుకున్నారు. హీరోయిన్ రష్మికా మందన్నా ఫోటోకు ట్విట్టర్ ఖాతా నుంచి పెట్టిన కామెంట్ ఆయన్ను వివాదంలోకి నెట్టింది. భీష్మ ప్రీరిలీజ్ ఫంక్షన్‌కు ముందు ఓ ఫోటోషూట్‌లో పాల్గొన్నారు. ఆ టైమ్‌లో ఆమె దిగిన కొన్ని ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆ ఫోటోకి అనూహ్యంగా జగిత్యాల కలెక్టర్ ట్విట్టర్ ఖాతా నుంచి ఓ కామెంట్ వచ్చింది. 'చించావు పో..' అని ఉన్న ఆ కామెంట్‌ను చదివి నెటిజెన్స్ ఒక్కసారిగా షాక్ తిన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఓ కలెక్టర్‌ ఇలాంటి కామెంట్స్ పెట్టడమేంటి అనుకుంటూ అవ్వాక్కయ్యారంతా. నెటిజన్స్ మాత్రమే కాక.. రష్మికా ఫోటోకి తన ట్విట్టర్ ఖాతా నుంచి కామెంట్ వెళ్లడమేంటని కలెక్టర్‌ కూడా ఖంగుతిన్నాడు. వెంటనే అప్రమత్తమైన ఆయన జగిత్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఎవరో తన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసి ఆ కామెంట్ పెట్టారని ఫిర్యాదులో చేశారు కలెక్టర్. దీనిపై విచారణ జరిపించాలని అధికారులను కోరారు. కలెక్టర్ విజ్ఞప్తి మేరకు పోలీసులు ప్రస్తుతం దానిపై దర్యాప్తు జరుపుతున్నారు. ఇక ట్వీట్ విషయానికి వస్తే.. అందులో చించావు పో రద్మిక అని ఉంది. రష్మిక బదులు రద్మిక అని ఉండటం ఆసక్తికరంగా మారింది. స్పెల్లింగ్ మిస్టేక్ నీట్ గా కనిపిస్తోంది. దీన్ని బట్టి.. ఆ ట్వీట్.. కలెక్టర్ చేసి ఉండరనే భావిస్తున్నారు నెటిజన్లు. కలెక్టరే అయి ఉంటే... రష్మిక స్పెల్లింగ్ ఎందుకు తప్పు రాస్తారని చర్చోపచర్చలు చేస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ కార్యాలయంలో తాత్కాలిక పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఈడీఎం మమత, హ్యాండ్ హోల్డింగ్ పర్సన్ ప్రసాద్‌లను విధుల నుంచి తప్పించారు. మొత్తానికి పోలీసుల విచారణ పూర్తయితే తప్ప ఇందులో అసలు వాస్తవమేంటో బయటపడేలా లేదు.