జపాన్‌లో 'హగిబిస్‌' తుఫాను...వణుకుతున్న దేశం

జపాన్‌లో 'హగిబిస్‌' తుఫాను...వణుకుతున్న దేశం

జపాన్‌ను మరో శక్తివంతమైన తుఫాను వణికిస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో తరచూ భూకంపాల ప్రభావానికి లోనయ్యే జపాన్ ని 1958 తర్వాత అత్యంత తీవ్రస్థాయిలో హగిబిస్‌ టైఫూన్ జపాన్ ను వణికిస్తోంది. ఈ తుఫాను వల్ల రాజధాని టోక్యోతో పాటు జపాన్‌ పసిఫిక్‌ తీర ప్రాంతంలో 80 సెం.మీ. వర్షపాతం, గంటకు 250 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నదని జపాన్‌ వాతావరణ విభాగం హెచ్చరించింది. కుండ పోత వర్షం కురుస్తుండటంతో జపానీలు చికురుటాకుల్లా వణికిపో తున్నారు. జనజీవనం స్తంభించింది. తుఫాను బలపడే ప్రమాద ముందని వాతావారణ శాఖ హెచ్చరించింది.

కొండచరియలు విరిగిపడే ప్రమాదముందని, రానున్న రెండు లేదా మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని హెచ్చరించింది. తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే అత్యవసర ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశించింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వందలాది ఇండ్లు వరద ప్రవాహంలో కొట్టుకొనిపోయాయి.

ఆకాశం గులాబీ రంగు పులుముకోవడం అక్కడి ప్రజలను మరింత భయ బ్రాంతులను చేస్తోంది. తుఫాను వలన వేలాది మంది నిరాశ్రయులయ్యారు. భారీ ఆస్తినష్టం సంభవించింది. తూర్పు, సెంట్రల్‌ జపాన్‌లో హగిబిస్‌ తుఫాను బీభత్సం సృష్టించే ప్రమాదముందని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పలు రైలు, విమాన సర్వీసులను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. అలాగే ఈరోజు జరగాల్సిన రగ్బీ ప్రపంచ కప్‌ మ్యాచ్‌తో పాటు ఇతర కార్యక్రమాలను కూడా నిర్వాహకులు రద్దు చేశారు.