పిల్లలకి ఎనర్జీ డ్రింక్ అమ్మకాలపై నిషేధం?

పిల్లలకి ఎనర్జీ డ్రింక్ అమ్మకాలపై నిషేధం?

పశ్చిమ యూరప్ లో ముఖ్యంగా బ్రిటన్ లో పిల్లల ఊబకాయం పెద్ద సమస్యగా మారింది. పిల్లల ఆరోగ్యానికి పెను సమస్యగా పరిణమించిన ఊబకాయం అదుపునకు ఇంగ్లాండ్ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పిల్లలకి ఎనర్జీ డ్రింక్ అమ్మకాలపై నిషేధం విధించే యోచనలో ఉంది యుకె ప్రభుత్వం. అత్యధిక మోతాదులో చక్కెర, కెఫీన్ ఉండే రెడ్ బుల్, మాన్ స్టర్, రెలెంటె లెస్ వంటి ప్రముఖ బ్రాండ్ల ఎనర్జీ డ్రింక్స్ ని పిల్లలకు అమ్మడాన్ని ప్రధానమంత్రి థెరెసా మే తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఊబకాయానికి కారణమవుతున్న ఎనర్జీ డ్రింక్స్ ను పిల్లలకు అమ్మడంపై నిషేధం విధించడంపై గురువారం నుంచి ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించింది. 

యుకెలో 10-17 ఏళ్లలోపు పిల్లల్లో మూడింట రెండొంతుల మందికి పైగా, 6-9 ఏళ్లలోపు వారిలో 25% మంది ఆరోగ్యానికి హాని చేసే ఎనర్జీ డ్రింక్స్ సేవిస్తున్నట్టు అంచనా. ఇవి ఆరోగ్యానికి చేటు చేయడంతో పాటు వీటి కారణంగా పలు ప్రవర్తనా సమస్యలకు దారి తీస్తున్నట్టు బ్రిటన్ ఆరోగ్యశాఖ గుర్తించింది. బాలల్లో ఊబకాయం దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అని ప్రధానమంత్రి మే అన్నారు. వీటిని చౌకగా అమ్ముతుండటంతో వేలాది మంది పిల్లలు దాదాపుగా ప్రతిరోజూ ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నందువల్ల ఈ సమస్య ఎదురవుతున్నట్టు గుర్తించామని చెప్పారు. పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్ అమ్మకాలపై ప్రజాభిప్రాయ సేకరణ జరిపి నిషేధించే యోచనలో ఉన్నట్టు ఆమె తెలిపారు.