హైదరాబాద్ లో ఊబర్ ప్రయాణం చౌక?!

హైదరాబాద్ లో ఊబర్ ప్రయాణం చౌక?!

విశ్వనగరం హైదరాబాద్ లో అంతర్జాతీయ ట్యాక్సీ యాగ్రిగేటర్ సంస్థ ఊబర్ లో ప్రయాణం ఇక చౌకగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్ర తయారుచేసిన ఎలక్ట్రిక్ వాహనాలు ఇవాళ హైదరాబాద్ ఊబర్ సమూహంలో చేరాయి. ఊబర్ తో వ్యూహాత్మక సహకారంలో భాగంగా తమ వివిధ ఎలక్ట్రిక్ వాహనాలను భారత్ లోని వివిధ నగరాల్లో ప్రవేశపెట్టనున్నట్టు మహీంద్ర గతంలో ప్రకటించింది. అందులో భాగంగా మహీంద్ర ఈ2ఓ ప్లస్, ఈవెరిటో వంటి మోడళ్లు ఊబర్ ఈవీ ఫ్లీట్ కి చేరాయి. దీంతో నగరంలో కాలుష్యం సున్న కావడంతో పాటు ప్రయాణం కూడా మరింత చౌక కానుంది.  ఈ ఎలక్ట్రిక్ వాహనాలు సజావుగా సాగిపోయేందుకు హైదరాబాద్ నగరంలోని 20కి పైగా ప్రధాన ప్రాంతాల్లో ఫోర్టమ్, పవర్ గ్రిడ్, హెచ్ పీసీఎల్ వంటి సంస్థలు సుమారు 40 ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేశాయి.

మహీంద్ర, ఊబర్ ల భాగస్వామ్యంలో భాగంగా మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లోని రోడ్లపై ప్రవేశపెట్టనున్నారు. ఊబర్ యాప్ ఉన్న డ్రైవర్ భాగస్వాములకు ప్రత్యేక ప్యాకేజీల ద్వారా మహీంద్ర ఎలక్ట్రిక్ వాహనాలు అందజేస్తారు. ఈ ప్యాకేజీలో ఆకర్షణీయమైన ధరలు, సులభ ఫైనాన్సింగ్, ఇన్సూరెన్స్ ప్రీమియమ్ లు కూడా ఉండనున్నాయి. అంతే కాకుండా ఈ వాహనాలకు మహీంద్ర, దాని అనుబంధ సంస్థల ద్వారా  సమగ్ర మెయింటెనెన్స్ ప్యాకేజీలు కూడా వినియోగించుకొనే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈవీ విధానంపై కసరత్తులు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం రాబోయే 45 రోజుల్లో ఒక స్పష్టమైన ప్రకటన చేయనున్నట్టు భావిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఇది ఎంతో దోహదకారి కానుందని అంటున్నారు.