తెరపైకి మరో బ్యాంక్ మోసం... రూ.737 కోట్లు టోకరా!

తెరపైకి మరో బ్యాంక్ మోసం... రూ.737 కోట్లు టోకరా!
బ్యాంకులకు టోకరా వేయడం విదేశాలకు పారిపోవడం చూస్తున్నాం తాజాగా... యూకో బ్యాంక్‌ మోసం కేసు వెలుగు చూసింది... ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సీబీఐ విచారణ ముమ్మరం చేసింది. యూకో బ్యాంక్‌లో జరిగిన రూ. 621 కోట్ల అక్రమ రుణాల స్కామ్‌ కేసులో సీబీఐ అధికారులు... యూకో బ్యాంక్‌ మాజీ చైర్మెన్‌, ఎండీ అరుణ్‌ కౌల్‌పై కేసు నమోదు చేశారు. శనివారం దేశ వ్యాప్తంగా దాదాపు 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన సీబీఐ... కౌల్‌తో పాటు ఎరా ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్రా ఇండియా పైనా, ఆ సంస్థ సీఎండీ హేమ్‌ సింగ్‌ బరానాతో పాటు చార్టర్డ్‌ అకౌంటెట్లు పంకజ్‌ జైన్‌, వందనా శార్దాలతో పాటు అల్టిస్‌ ఫిన్‌సెర్వ్‌కు చెందిన పవన్‌ బన్సాల్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. తప్పుడు పత్రాలతో యూకో బ్యాంకులను మోసం చేసి... దాదాపు రూ.621 కోట్ల మేర రుణాలను పొందిన సదరు వ్యక్తులు... ఆ నిధులను మళ్లించారంటూ కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. 2010-15 మధ్య కాలంలో యూకో బ్యాంక్‌ సీఎండీగా కౌల్‌ పని చేస్తున్న కాలంలోనే ఎరా ఎన్‌ఫ్రా సంస్థకు చెందిన ప్రతినిధులు అక్ర మంగా, ఎక్కువ విలువను కనబరిచే పత్రాలను చార్టర్డ్‌ అకౌంటెంట్ల సాయంతో సృష్టించి బ్యాంక్‌ రుణాలను పొందినట్టుగా సీబీఐ గుర్తించింది. కంపెనీ 2010 మార్చిలో రూ.200 కోట్లు, అదే ఏడాది అక్టోబర్‌లో రూ.450 కోట్ల మేర రుణాలను పొందింది. వీటిని బ్యాంక్‌ 2013 జులైలో నిరర్థక ఆస్తిగా ప్రకటించింది. అది వడ్డీతో కలిపి రూ.737 కోట్ల వరకు నష్టం జరిగిందంటున్నారు అధికారులు.